రేపటి నుంచి ఏప్రిల్ 6 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల 45 పాఠశాలలకు చెందిన 5 లక్షల 34 వేల 903 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షకు సిద్ధమవుతున్న వారిలో 2 లక్షల 73 వేల 971 మంది బాలురు కాగా 2 లక్షల 60 వేల 392 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 530 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 30 వేల 500 మంది ఇన్విజిలేటర్లతోపాటు.. మాల్ ప్రాక్టీస్ నిరోధానికి 144 సిట్టింగ్ స్క్వాడ్ లు, నలుగురు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు.
గంట ముందు కేంద్రాలకు..
ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. కనీసం గంట ముందు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్లు పాఠశాలలతోపాటు.. www.bse.telangana.gov.in వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సత్యనారాయణ రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ద్రావణం, మందులు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
గుంపులు ఉండకుండా...
కరోనా వ్యాపిస్తున్న వేళ విద్యార్థులు కేంద్రాల వద్ద గుంపులు ఉండకుండా.. ఎప్పుడు వెళ్తే.. అప్పుడే లోపలికి పంపించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు మాస్కులతో వచ్చినా.. సొంతంగా మంచినీటి సీసాలు తెచ్చుకున్నా అనుమతివ్వాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
కంట్రోల్ రూంలు
దగ్గు, తుమ్ములు, జ్వరంతో బాధపడితే.. ప్రత్యేక గదిలో పరీక్ష రాయించాలని నిర్ణయించారు. విద్యార్థుల అనుమానాలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని కూడా 040-23230942 ఫోన్ నంబరు ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
పరీక్షలు రాయనున్న వీణావాణి
వైద్య రంగానికి సవాల్ విసిరి.. జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించిన అవిభక్త కవలలు.. వీణావాణి.. పదో పరీక్షలకు సిద్ధమయ్యారు. యూసుఫ్‌గూడలోని ప్రతిభ పాఠశాల కేంద్రంలో రేపటి నుంచి పరీక్ష రాయనున్నారు. వీణా వాణి ఇద్దరికీ వేర్వేరుగా హాల్ టికెట్లు ఇచ్చారు.
ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్-19 ఎఫెక్ట్