రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని... ఏడేళ్ల తెలంగాణలో తెరాస ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడుస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే అభివృద్ధి చేస్తే ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపా పాలనలో కొత్త పెన్షన్ విధానం తెచ్చి ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం పదేళ్లకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ 14 శాతం మాత్రమే ఇస్తోందని గన్ పార్కు వద్ద తెరాస ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి విమర్శించారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు భాజపా ప్రభుత్వం 12 శాతం మాత్రమే పీఆర్సీ ఇచ్చిందని గుర్తు చేశారు. గుజరాత్లో పదేళ్లకు 14.5 శాతం మాత్రమే ఇచ్చిందన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ పీఆర్సీ ప్రకటించి.. ఆ పార్టీ నేతలు విమర్శలు చేయాలని హితవు పలికారు.
హిందూ ప్రేమికులం అంటున్న భాజపా నేతలే మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హిందువులు అని చెప్పుకునే భాజపా నాయకులు ఎక్కడైనా గుడి కట్టారా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, విద్యాసాగర్ రావులను చూసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న భాజపా నాయకులు నేర్చుకోవాలని సూచించారు. రెచ్చగొట్టే మాటలతో అధికారం, విధ్వంసం సృష్టిస్తే ప్రభుత్వం రాదన్నారు. నిరుద్యోగులను తెరాస ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : నీళ్లలా జిల్లా పరిషత్ నిధులు ఖర్చు