హైదరాబాద్‌కు చెందిన హెటెరో గ్రూపు, రష్యాకు చెందిన కొవిడ్-19 టీకా ‘స్పుత్నిక్ వి’ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ టీకాను ఉత్పత్తి చేసి, మన దేశంతో పాటు ఇతర దేశాలకు అందించడానికి రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌తో హెటెరో గ్రూపు కొంతకాలం క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. ఇలాంటి ఒప్పందాలను ఆర్‌డీఐఎఫ్ మన దేశానికి చెందిన 6 ఫార్మా కంపెనీలతో కుదుర్చుకుంది. వాటిలో హెటెరో గ్రూపు ఒకటి.
ఇందులో భాగంగా హెటెరో సంస్థకు ఆర్‌డీఐఎఫ్ నుంచి స్పుత్నిక్-వి టీకా సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అయింది. దీంతో ‘స్పుత్నిక్ వి’ టీకా ఉత్పత్తి మొదలుపెట్టినట్లు హెటెరో గ్రూపు ఛైర్మన్ బి.పార్థసారథిరెడ్డి తెలిపారు. స్పుత్నిక్-వి టీకాను ఉత్పత్తి చేస్తున్న కంపెనీల ప్రతినిధులతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వర్చువల్ పద్ధతిలో సమావేశమయ్యారు.
స్పుత్నిక్-వి టీకాతో పాటు స్పుత్నిక్ లైట్ టీకానూ ఉత్పత్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు హెటెరో గ్రూపు ఛైర్మన్ పార్థసారథి రెడ్డి స్పష్టం చేశారు. దాదాపు 20 కోట్ల డోసుల స్పుత్నిక్-వి, స్పుత్నిక్ లైట్ టీకాల ఉత్పత్తికి వీలుగా పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. యాంటీ-రెట్రోవైరల్స్ (ఏఆర్వీ) విభాగంలో ప్రపంచ అవసరాల్లో 40 శాతం మేరకు ఔషధాలు సరఫరా చేయగల సామర్థ్యం తమకు ఉన్నట్లు తెలిపారు. రష్యాతో తమకు దశాబ్ద కాలానికి పైగా అనుబంధం ఉందని, దాదాపు 50 మిలియన్ డాలర్ల పెట్టుబడితో మాస్కోలోని మాకిజ్‌లో మందుల తయారీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి: Black fungus: నిండుకుంటున్న బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు