రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బీఎన్‌రెడ్డి డివిజన్‌లోని కాప్రాయ్ చెరువు.. సుమారు 15ఎకరాల్లో విస్తరించి ఉంది. ఒకప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు సాగునీటి అవసరాలను తీర్చిన ఈ తటాకం నేడు ఉనికిపాట్లు పడుతోంది. ఈ జలాశయం పరిధిలోని భూముల్లో.. స్థానికులు ఇళ్లు నిర్మించుకున్నారు.1995లో ఈ చెరువును ఆనుకొని హరిహరపురం కాలనీ ఏర్పడగా.. కట్టకు అవతలి వైపు మరికొన్ని కాలనీలు వెలిశాయి. కాంక్రీట్‌లో చిక్కుకుపోయిన కాప్రాయ్ చెరువులో.. నీరు బయటికి వెళ్లేందుకు మార్గాలు లేకుండాపోయాయి. కట్టకు అమర్చిన తూముల గేట్లు దొంగలపాలయ్యాయి. నీళ్లు బయటకు పోకుండా వాటిని మూసేసి.. అలుగుపారకుండా అడ్డుకట్ట వేశారు. కాలనీల్లోని రహదారులన్నీ సీసీ రోడ్లతో కప్పేశారు.
మానవ తప్పిదాలే... తటాకానికి ఉరితాడై
అడుగడుగునా మానవ తప్పిదాల వల్ల కాప్రాయ్ చెరువుకు ఉరితాడు బిగుసుకుపోయింది. ఫలితంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల రూపంలో పొటెత్తి.. చుట్టుపక్కల కాలనీలను ముంచేసింది. చెరువు నిండితే గొలుసుకట్టు చెరువులైన కుమ్మరికుంట, బాతుల చెరువు, పెద్ద అంబర్ పేట మీదుగా వరద నీరంతా మూసీలో కలుస్తుంది. కానీ వరద ప్రవాహానికి నిర్మాణాలు అడ్డుగోడగా మారడం వల్ల.. చెరువులోకి చేరే వరదనీటితో బఫర్‌జోన్‌లో ఉన్న హరిహరపురం కాలనీ మునిగిపోయింది. ఒకసారి వానలకు నీటమునిగిన కాలనీ.. రెండోసారి కురిసిన భారీ వర్షాలకు మళ్లీ జలదిగ్బంధంలో చిక్కుకుని భారీగా ఆస్తినష్టం వాటిల్లింది.
వరదను మళ్లించి ముంపు సమస్య నుంచి బయటపడేందుకు స్థానికులు చేపట్టిన పనులు వివాదానికి దారితీశాయి. చెరువు కట్టకు అవతలి వైపున్న కాలనీవాసుల నుంచి అభ్యంతరం ఎదురై... పరస్పరం కేసులు పెట్టుకునే పరిస్థితికి వెళ్లింది.
నిండా ముంచేశారు
అధికారుల నిర్లక్ష్యమే కాప్రాయ్ చెరువు దుస్థితికి కారణమని ఆరోపిస్తున్నారు స్థానికులు. చెరువుకు వరద వచ్చే పరిస్థితే లేదని చెప్పి.. నిండా ముంచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల కంటే ముందే చెరువును పరిశీలించిన అధికారులు.. సాధారణ వర్షాపాతం కంటే ఎక్కువ నమోదమైతే ప్రమాదమేనని ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో వరదముప్పు నివారించేందుకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి: గ్రేటర్లో చెరువులు మాయం... వరదలకు ఆక్రమణలే కారణం!