international girl child day 2022 ''బాస్ నన్ను లవ్ చేస్తున్నావా... సృష్టికి మూలం ఆడదే అనే రొటీన్ పొగడ్తలు మాత్రం నాకు అవసరం లేదు. స్త్రీ లేకపోతే మానవ మనుగడే లేదు కిరీటాలు నాకు అక్కర్లేదు. కేవలం నీలాంటి మనిషిగా నన్ను గుర్తించు చాలు... నీకు ఇష్టమైన బట్టలు వేసుకుంటావ్... నీకు ఇష్టమైన తిండి తింటావ్ చివరకు నీకు ఇష్టమైన వాళ్లనే ప్రేమిస్తావ్... మరి ఆ ఇష్టం నాకు ఉండదా?
నేను కూడా నీలాంటి మనిషినే కదా బ్రో? ఇష్టం లేని వ్యక్తిని ఎలా ప్రేమించమంటావ్? నచ్చకపోతే నో చెప్పే హక్కు కూడా లేదా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే... నా సంతోషాన్ని కదా కోరుకుంటవ్? నిన్ను తిరిగి కొట్టలేననే కదా నన్ను నడిరోడ్డుపై నరికేస్తున్నవ్!! నా ప్రాణాలు తీయాలనుకునే నీది ప్రేమ అవుతుందా బాస్? ఇది అర్థం చేసుకోవడానికి డిగ్రీలు పీజీలు అవసరం లేదు... కేవలం మనిషి అయితే చాలు! గోరంత మానవత్వం ఉంటే చాలు.. ఇవాళ బాలికా దినోత్సవమంట.. నన్ను బతకనివ్వు బ్రో... నాకు నచ్చినట్టుగా!!''
ఈ మాటలు ఎవరివి అనుకుంటున్నారా... ఇది సాధారణ బాలిక మనోభావాలు.. అవును... ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి ఇంటికి వచ్చినట్లే.. అంటారు. అయితే మనం ఎంత అభివృద్ధి చెందినా.. తల్లిగర్భంలో ఉన్నది ఆడశిశువు అని తెలిస్తే బయట పడకుండానే హతమారుస్తున్నారు. మరికొందరు ఆడపిల్ల పుడితే చెత్తకుప్పల్లో, మురుగునీటి కాలువల్లో వదిలేసి వెళ్తున్నారు. ఆడపిల్ల పుట్టిందని భార్యలను పుట్టింట్లోనే వదిలేసిన భర్తలూ ఉన్నారు. ఇవి రోజూ టీవీల్లో, పేపర్లో చూస్తూనే ఉంటున్నాం. వీటిన్నంటిని మార్చాలి అంటే... ఒకటే మార్గం. మనం ఆలోచించే విధానం. మన ఆలోచన తీరు మారాలి. ఇంట్లో ఆడపిల్ల, మగపిల్లాడు.. ఇద్దరిని ఒకేలా చూడాలి. ఇంట్లోంచి బయటకు వెళ్తున్న ఆడపిల్లకు జాగ్రత్తలు చెప్పడం కాకుండా.. మగపిల్లాడికి ఆడపిల్లతో ఎలా మెలగాలో చెప్పండి. అప్పుడే ఈ సమాజం మారుతుంది.
ఇదీ చూడండి: రాఖీ బాధపడుతోంది.. ఎందుకో తెలుసా?!