లేలేత మంచుతెరల్లో నులివెచ్చని మంటలు..
వేకువ చీకట్లను చీల్చే కాంతి కిరణాలు...
ఇవిగో ఇవే.. భోగిపండుగకు ఆహ్వానం పలికే జ్వాలాతోరణాలు..! తెలుగువారి ముచ్చటైన మూడురోజుల పండుగలో ముందుగా సందడి తెచ్చేదే భోగి..! ఇళ్ల ముందు వేసే భోగి మంటలతో ఈ పండుగ మొదలవుతుంది. తెల్లారకముందే లేస్తారు. ఆవుపేడతో చేసిన పిడకలు, తాటాకులు, ఇతర చెట్ల కర్రలను ఒకచోట వేసి మంటలు వేస్తారు. ఊర్లో ఉన్నవాళ్లు, ఊళ్ల నుంచి వచ్చినవాళ్లు, చిన్నాపెద్దా అంతా చుట్టూ చేరి చలి మంటలు కాచుకుంటారు.
భోగిమంటల పరమార్థం
పాత చెడు ఆలోచనలను వదిలించుకుని... కాలంతోపాటు వచ్చే మార్పులకు అనుగుణంగా మనసును సిద్ధం చేయడమే భోగిమంటల పరమార్థం. అందుకే.. పాత కుర్చీలు, బల్లలు మంటల్లో వేస్తుంటారు. సూర్యుడి సంక్రమణంలో దక్షిణాయనానికి.. ఆఖరి రోజు భోగి..! దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ప్రసాదించమని ప్రజలు ప్రార్థిస్తారు. లేలేత మంచుతెరల్లో జ్వలించే నులివెచ్చని మంటలు మదిలోని నిరాశా నిస్పృహల చీకట్లను చీల్చే కాంతి పుంజాల్లాంటివని కూడా పండితులు ప్రవచిస్తుంటారు.
ఇక భోగిమంటలయ్యాక తలస్నానం చేసి కొత్తబట్టలు కట్టుకుంటారు. ఆ తర్వాత కొత్త బియ్యంతో చేసే పులగం తినడం సంప్రదాయం. కొత్త బియ్యం, పెసరపప్పు,.. నెయ్యి, మిరియాలు జోడించి వండే పులగం.. చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపిస్తుందని పెద్దలు చెప్తారు. అందుకే నేటితరం పిల్లలు వింతగా చూసినా.. పెద్దవాళ్లు దాని విశిష్టతను చెప్పిమరీ పులగం తినిపిస్తారు.
భోగినాడు సాయంత్రం సందడంతా బొమ్మల కొలువుదే. ఇంట్లో ఉండే బొమ్మలన్నీ పోగేస్తారు. వాటిని వరుసలో చేరుస్తారు. కొందరైతే పురాణ ఇతిహాసాలు ప్రతిబింబించేలా బొమ్మలను కొలువుదీరుస్తారు.. దేవుడి పాటలు పాడి ఆశీస్సులు కోరుకుంటారు.
భోగి పళ్లు
ఇక భోగి పండుగ గురించి చెప్పుకోవాల్సిన మరో విశిష్టత పిల్లలకు భోగి పళ్లు పోయడం. సూర్యుడి రంగు ఎరుపు, ఆకారం గుండ్రం.! అలాంటి రంగు ఆకారాన్ని పోలి ఉన్న.. రేగి పళ్లను చిన్నారుల తలపై పోయడం వల్ల మేథాశక్తి, ఆరోగ్య శక్తి లభిస్తాయని విశ్వాసం. అందుకే రేగిపళ్లతోపాటు పూలరేకులు, చిల్లర నాణేలతో కలిపి 3సార్లు సవ్య, అపసవ్య దిశలో తిప్పి... పిల్లల తలపై పోస్తారు. ఇప్పుడైతే పిల్లల సరదా కోసం చాక్లెట్లు కూడా కలిపిపోస్తున్నారు. భోగిపళ్లు పోయడంద్వారా .. పిల్లలకుండే దిష్టి దోషాలు కూడా తొలగుతాయని విశ్వాసం. ఏకాలంలో దొరికేవి ఆకాలంలోనే తినాలి. ఇప్పుడు మాత్రమే దొరికే రేగిపళ్లలోని గుజ్జుతింటే పిల్లలకు అజీర్తి, మలబద్ధకం కూడా పోతుందని కూడా చెప్తుంటారు.
ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న భోగిపండుగను తెలుగువారు వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంస్కృతీ సంప్రదాయాల ఆధారంగా జరుపుకొంటారు. భౌగోళిక సరిహద్దుల్ని బట్టి ఈ రీతులు మారినా..... ప్రతిచోటా భోగి మంటలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి.
- ఇదీ చూడండి: భోగి మంటల అర్థం, పరమార్థం ఏంటీ..?