ప్రపంచంలో అన్ని బంధాల కన్నా పేగు బంధం గొప్పది. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఉన్నప్పటికీ.. ఎక్కువగా అనుబంధం ఉండేది మాత్రం తల్లితోనే. అమ్మ జోలపాట, గోరు ముద్దలు తిన్న జ్ఞాపకాలు ఎవరి జీవితంలోనైనా.. మధుర స్మృతులే. బిడ్డల సుఖ,సంతోషాలనే కాంక్షిస్తూ తల్లి వారిని పాలిస్తుంది. ప్రేమగా లాలిస్తుంది. భూమాత కంటే ఓర్పుతో కంటికి రెప్పలా కాపాడుతూ వారిని పెంచి పెద్దవారిని చేస్తుంది. బిడ్డల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తుంది. సమాజంలో అందరికంటే మిన్నగా ఎదగాలని నలుగురికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటుంది.
అమ్మకు ఓ రోజుంది..
అన్ని దినోత్సవాల్లోగే అమ్మను పూజించడానికీ.. ఓ రోజుంది. మనదేశంలో మే నెల మొదటి ఆదివారం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయత, అనురాగం చూపించడంలో కొడుకుల కంటే కుమార్తెలే ముందుంటారనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
అమ్మకే చెల్లింది..
నవమాసాలు మోసి కన్న పిల్లల కోసం జీవితాంతం అండగా నిలిచే అమ్మను గౌరవించుకోవడం, ఆమె మనసు గెలుచుకోవడం మాతృదినోత్సవ పరమార్థం. మారుతున్న జీవనగమనంలో రానురాను కొందరు అమ్మనే నిర్లక్ష్యం చేస్తున్నారు. జీవిత చరమాంకంలో తల్లిని కళ్లలో పెట్టుకోవాల్సినప్పటికీ...భారంగా చూస్తున్నారు. ఇంకొందరు పట్టెడు అన్నం పెట్టలేక వృద్ధాశ్రమాలకు తరలిస్తున్న వైనాలు చూస్తున్నాం. నేటి సమాజంలో అందరూ ఉండి అనాథలా బతికే అమ్మలెందరో కన్నతీపి ప్రేమ కోసం తపిస్తున్నారు. ఇంత చేసినా బిడ్డల బాగోగుల కోసమే పరితపించడం ఒక్క అమ్మకే చెల్లింది.
ఇవీ చూడండి: అమ్మా.. నీ మనసు వెన్న...