- నగరం అసాధారణ రీతిలో ముంపునకు గురవడానికి కారణమేంటి?
జేఎన్‌టీయూ పరిశీలన ప్రకారం.. హైదరాబాద్‌లో ప్రస్తుతం పది సెంటీమీటర్ల వర్షం పడినా పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోతోంది. మనకున్న నాలాల వ్యవస్థకు నాలుగైదు సెం.మీ. వర్షాన్ని తట్టుకోగలిగే సామర్థ్యం కూడా లేదు. అదీగాక మనకు డ్రైనేజీ, నాలాలకు ప్రత్యేక వ్యవస్థలు లేవు. నగరమంతటా దాదాపుగా కలిసే పోతున్నాయి. దీంతో భారీ వర్షం పడితే మురుగు నీరు రోడ్లపైకి రావడం వల్ల పరిస్థితి దారుణంగా మారుతోంది.
- ముంపు నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి?
జేఎన్‌టీయూ నిపుణులు దీనిపై పరిశీలించి రెండు రకాల ప్రతిపాదనలు చేశారు. ఒక నివేదికను రెండేళ్ల కిందటే అప్పటి బల్దియా కమిషనర్‌కు అందజేశాం. దాని ప్రకారం.. వరదనీటి తరలింపునకు ప్రత్యేకంగా 450 కి.మీ. పొడవునా మేజర్ నాలాలను, అనుబంధంగా 1000 కి.మీ. పొడవునా మైనర్ నాలాలను నిర్మించాలి. అనుబంధంగా 650 చెరువులను కొత్తగా తవ్వాలి. నాలాల నీటిని ఆ చెరువుల్లోకి మళ్లించాలి. నగరంలో ముంపునకు గురయ్యే 209 ప్రాంతాలను గుర్తించి ఉన్నత ప్రమాణాలతో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుత నాలాల వ్యవస్థను కొంతమేర సంస్కరించాలి. ఈ ప్రాజెక్టుకు రూ. 4,990 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశాం.
- తాజా ప్రణాళిక ప్రకారం ముంపు సమస్యను ఎలా అధిగమించొచ్చు?
తొలి ప్రాజెక్టు వ్యయం భారీగా ఉండడంతో మరో నివేదికను ప్రభుత్వానికి ఇవ్వబోతున్నాం. దీని ప్రకారం మూసీ నదిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలి. నగరంలో 400 కి.మీ. పొడవునా బైపాస్ నాలాలను తవ్వాలి. మరో వెయ్యి కి.మీ. మేర రోడ్ల వెంబడి నాలాలను నిర్మించాలి. మూసీ నదిలో 5 మీటర్ల వెడల్పు, మీటరు ఎత్తులో 3 ఛానెల్స్ నిర్మించాలి. రెండు ఛానెల్స్‌ను వర్షపు నీటి కోసం, ఒక ఛానెల్‌ను శుద్ధి చేసిన మురుగునీటిని పంపించేందుకు వాడాలి. ఇలా చేస్తే గంటలో 2.70 లక్షల కోట్ల లీటర్ల నీటిని కిందికు తరలించవచ్చు. రాజధానిలో 750 చదరపు కి.మీ. విస్తీర్ణంలో 30 సెం.మీ. వర్షం పడితే 22,500 కోట్ల లీటర్ల నీరు కిందికి పడే అవకాశం ఉంది. మా రెండో ప్రతిపాదన ద్వారా ఎలాంటి ముంపు వాటిల్లకుండా మూసీలో నుంచే ఈ నీటిని దిగువకు తరలించవచ్చు. ఇందుకు రూ. 1000 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశాం. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే నగరంలో ముంపు ముప్పు తప్పుతుందని మా ఇంజినీర్ల బృందం ఏకాభిప్రాయానికి వచ్చింది. ఇప్పుడున్న చెరువులకు గొలుసుకట్టు ఏర్పాటు చేస్తే కొంతమేర ఫలితం ఉంటుంది.
ఇదీ చూడండి: వరద బాధితులకు గ్రేటర్ పరిధిలోని తెరాస ప్రజాప్రతినిధుల విరాళం