తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి మూడు జిల్లాలు పెద్ద సవాలుగా మారాయి. కొంతకాలంగా సూర్యాపేట, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ మూడు జిల్లాల్లో కరోనా కేసులు వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రత్యేక అధికారులను నియమించింది. వికారాబాద్ జిల్లాకు రజత్ కుమార్ షైనీ, గద్వాలకు రోనాల్డ్ రోస్, సూర్యాపేటకు సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది.
పోలీసు శాఖలోనూ బదిలీలు
రాష్ట్రంలోని మూడు జిల్లాల పరిధిలో పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచిలో ఏసీపీ ఎస్.మోహన్ కుమార్‌ను సూర్యాపేట డీఎస్పీగా.. రాష్ట్ర పోలీసు అకాడమీ డీఎస్పీ ఎ. యాదగిరిని గద్వాల్ డీఎస్పీగా బదిలీ చేశారు. సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర రావు, గద్వాల్డీఎస్పీ పాల్వాయి శ్రీనివాస్ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ బదిలీలకు సంబంధించి అధికారులు వెంటనే రిలీవ్ అయి కొత్తగా బదిలీ అయిన ప్రాంతాల్లో రిపోర్ట్ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.