TSRTC Special Arrangements At Toll Plazza: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీఎస్‌ఆర్టీసీ ఆలోచన చేస్తుంది. టోల్‌ప్లాజాల వద్ద సులువుగా ఆర్టీసీ బస్సులు వెళ్లేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ప్రధాన మార్గాల్లోని టోల్ ప్లాజాల వద్ద టీఎస్‌ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లైన్లను కేటాయించాలని కోరుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ), తెలంగాణ ఆర్ అండ్ బీ విభాగాలకు లేఖలు రాసింది.
ఇదే అంశంపై టోల్ ప్లాజా నిర్వాహకులనూ సంప్రదించింది. తమ సంస్థ బస్సులకు ప్రత్యేక లైన్‌ను కేటాయించాలని అభ్యర్థించింది. అందుకూ ఆయా విభాగాలు అంగీకరించాయి. ఈ నెల 10 నుంచి 14 తేదీ వరకు టీఎస్‌ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లైన్‌ను కేటాయిస్తామని ఆయా శాఖలు హామీ ఇచ్చాయి. ఇందుకు టీఎస్‌ఆర్టీసీ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ముందుకెళ్తామని పేర్కొంది.
ఏఏ మార్గాల్లో ఆర్టీసీ చర్యలు: రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్ - విజయవాడ మార్గంలోని పతంగి, కోర్లపహాడ్, హైదరాబాద్ - వరంగల్ మార్గంలోని గూడురు, హైదరాబాద్ - సిద్దిపేట మార్గంలోని దుద్దేడ, హైదరాబాద్ - నిజామాబాద్ మార్గంలోని మనోహరబాద్, హైదరాబాద్ - కర్నూలు మార్గంలోని రాయికల్ టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. ఆయా టోల్ ప్లాజాల వద్ద ఆరుగురు ఆర్టీసీ సిబ్బంది మూడు షిప్ట్‌ల్లో 24 గంటలపాటు విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తుంది.
ఆర్టీసీ బస్సులు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక లైన్ నుంచి బయటకు వెళ్లేందుకు స్థానిక పోలీసుల సహకారం కూడా టీఎస్‌ఆర్టీసీ తీసుకుంటుంది. సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌లోని బస్ భవన్, ఎంజీబీఎస్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసింది. వాటి ద్వారా రద్దీ సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పడు ఆర్టీసీ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే చర్యలు తీసుకుంటారు.
సంక్రాంతికి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. 4,233 ప్రత్యేక బస్సులను ఈ నెల 10 నుంచి 14వ తేది వరకు నడుపుతున్నామని ఆర్టీసీ పేర్కొంది. ప్రజలందరూ ఈ సంక్రాంతికి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించండని ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు అని ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
ఇవీ చదవండి: