రాష్ట్రంలో వస్తు సేవల పన్ను-జీఎస్టీ రాబడులు క్రమంగా తగ్గుతున్నాయి. ఆర్థిక మాంద్యంతో పాటు పన్ను ఎగవేతదారుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కొన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు రిటర్న్‌లు దాఖలు చేయకుండా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రిటర్నులు దాఖలు చేయని సంస్థలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
యాప్‌తో పెండింగ్ రిటర్నులు
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.71 లక్షల వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉండగా, కేంద్ర జీఎస్టీ పరిధిలో 1.87లక్షలు, రాష్ట్ర జీఎస్టీ పరిధిలో 2.84 లక్షలు ఉన్నాయి. వీటిలో రిటర్న్‌లు దాఖలు చేయని వ్యాపార, వాణిజ్య సంస్థలు దాదాపు 30 శాతం ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. వీరి పని పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. ప్రత్యేక ఇంఛార్జ్-ఓఐసీ పేరున ప్రత్యేక యాప్‌ను హైదరాబాద్ ఐఐటీ సంస్థ ద్వారా ప్రభుత్వం తయారు చేయించింది. ఆ యాప్ ద్వారా పెండింగ్ రిటర్నులను వసూలు చేయడం, సిబ్బంది, అధికారుల పని తీరును పర్యవేక్షణ చేసే కార్యక్రమాన్ని వాణిజ్య పన్నుల శాఖ చేపట్టింది.
కేవలం 40 శాతం వసూలు..
2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి రూ.31,186 కోట్లు జీఎస్టీ రావాల్సి ఉంది. కానీ సెప్టెంబరు వరకు రూ.12,875 కోట్లు మాత్రమే వసూలైంది. కేవలం 40 శాతం మాత్రమే వచ్చింది. కాగా రాబోవు ఆరు నెలల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు వసూలు కావాల్సి ఉంది. ముందుగా మేల్కొన్న రాష్ట్ర ప్రభుత్వం రిటర్నులు దాఖలు చేయని సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు అందరికి రిటర్న్‌లు దాఖలు చేయించే బాధ్యతను ఉన్నతాధికారులు అప్పగించారు. రాష్ట్రంలోని 12 వాణిజ్య డివిజన్ల పరధిలో 1200 మందికి పైగా అధికారులను, సిబ్బందిని రంగంలోకి దించిన ప్రభుత్వం వారికి విడివిడిగా లక్ష్యాలను నిర్దేశించారు.
ఆయా సిబ్బందికి, అధికారులకు ఒక్కొక్కరికి 18కి తక్కువ కాకుండా 50 వరకు ఇప్పటికీ రిటర్నులు వేయని వ్యాపార, వాణిజ్య సంస్థలతో వేయించే బాధ్యతను అప్పగించింది. వీరు ప్రతి రోజు ఆయా సంస్థలకు ఫోన్ చేసి రిటర్నులు దాఖలు చేయించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది మంచి ఫలితాలు ఇస్తున్నట్లు చెబుతున్న అధికారులు దీనిని దశల వారీగా చేయకుండా పన్నులు ఎగవేతకు పాల్పడుతున్న అన్ని సంస్థలపై అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
ఇదీ చూడండి : భారీగా వేములవాడ రాజన్న హుండీ కానుకల చోరీ