Electricity Department Helpline: వర్షాకాలంలో కరెంటు స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లరాదని ప్రజలను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) సీఎండీ జి.రఘుమారెడ్డి హెచ్చరించారు. ఏదైనా ప్రాంతం లేదా ఇంటిలో కరెంటు సరఫరా నిలిచిపోయినా, విద్యుత్ ప్రమాదం జరిగినా.. ఫిర్యాదు చేసేవారు తమ కరెంటు బిల్లుపై ఉండే ‘యు.ఎస్.సి.’ సంఖ్యను తప్పనిసరిగా తెలపాలని ఆయన సూచించారు. దీనివల్ల ఆ ప్రదేశాన్ని సిబ్బంది ఆన్‌లైన్‌లో వేగంగా గుర్తించి అక్కడికి చేరుకోగలుగుతారని వివరించారు. సరఫరా సమస్యలు, ప్రమాదాలపై 1912 లేదా 100 లేదా స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీసులకు ఫోన్ చేయాలి. లేదా ప్రత్యేక కంట్రోల్ రూం నంబర్లు 7382072104, 7382072106, 7382071574కు ఫిర్యాదు చేయాలని సీఎండీ సూచించారు. దక్షిణ డిస్కం మొబైల్ యాప్, వెబ్‌సైట్, ట్విటర్, ఫేస్‌బుక్ ద్వారా కూడా సమస్యలు తెలపవచ్చన్నారు. అధిక వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారులు, విద్యుత్ ఇంజినీర్లతో రఘుమారెడ్డి శనివారం ఆడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. వానాకాలం ముగిసేవరకు ప్రతి జిల్లా/ సర్కిల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. తగిన సిబ్బందిని నిత్యం అందుబాటులో ఉంచుకోవాలని ఎస్‌ఈలను ఆదేశించారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసినప్పుడు విద్యుత్ సరఫరా పర్యవేక్షణ కోసం రెండు చోట్ల కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు.
వర్షాకాలంలో ప్రజలకు జాగ్రత్తలు..
* వర్షాలు పడేటప్పుడు స్టే వైర్, విద్యుత్ తీగల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిలబడరాదు. వాటికి దూరంగా ఉండాలి. పశువులను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలి.
* రోడ్డుమీద, నీటిలో విద్యుత్ తీగ పడి ఉంటే దాన్ని తాకవద్దు. దాని మీదుగా వాహనాలు నడపరాదు. తీగలు తెగిపడితే సమీప విద్యుత్ సిబ్బందికి లేదా కంట్రోలు రూం నంబర్లకు ఫోన్ చేయాలి.
*ఎవరికైనా విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురైతే.. రక్షించడానికి లోహపు వస్తువులు, ఇనుప రాడ్లు వాడరాదు. చెక్క లేదా ప్లాస్టిక్‌తో చేసిన ఉపకరణాలనే వాడాలి.
ఇవీ చూడండి..
'రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి'
భారీ వరదతో ప్రాజెక్టులకు జలకళ.. గేట్లు ఎత్తి నీటి విడుదల
అమర్నాథ్ వరదల్లో 16కు మృతులు.. 15వేల మంది సేఫ్.. రంగంలోకి ఆర్మీ చాపర్లు