నైరుతి రుతుపవనాలు ఎల్లుండిలోగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని.. తొలుత దక్షిణ జిల్లాల్లోకి వస్తాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. శుక్రవారం కేరళ అంతటా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొంత భాగం విస్తరించాయన్నారు. ఆది, సోమవారాల్లో తెలంగాణలో రుతుపవనాల వర్షాలు ప్రారంభమవుతాయని అంచనా.
శనివారం నుంచి రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఒక మాదిరి వర్షాలు కురుస్తాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 6 డిగ్రీల వరకూ తక్కువగా నమోదయ్యాయి. మెదక్‌లో శుక్రవారం పగలు 32.6 డిగ్రీలే ఉంది. హైదరాబాద్‌లోనూ వాతావరణం బాగా చల్లబడింది. ఎల్‌బీనగర్, హయత్నగర్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 407 ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా జలాల్‌పూర్(యాదాద్రి జిల్లా)లో 8.4, ములుగు(సిద్దిపేట)లో 8.3, కమాన్‌పూర్(పెద్దపల్లి)లో 6.7, కాగజ్‌నగర్(కుమురంభీం)లో 5.5, పెద్దూరు(రాజన్న సిరిసిల్ల జిల్లా)లో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో శుక్రవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల వడగండ్లు పడ్డాయి. ఈదురు గాలుల ధాటికి గ్రామాల్లో ఇళ్లపైకప్పు రేకులు ఎగిరిపోగా.. చెట్లు కూలిపోయాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ శివారులో విద్యుత్తు నియంత్రిక రోడ్డుపై పడిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. దుమాల, తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో కోళ్లఫారం షెడ్ల రేకులు ఎగిరిపోగా కోళ్లు మృత్యువాతపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది.