ఆలస్యం లేకుండా షెడ్యూల్ ప్రకారం బొగ్గు రవాణా జరిగేందుకు చర్యలు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే ఇంఛార్జ్ జీఎం అరుణ్ కుమార్ జైన్ సూపర్‌వైజర్లను ఆదేశించారు. సరుకు రవాణా మార్గాలలో అడ్డంకులుంటే వాటిని గుర్తించాలన్నారు. ఆయా సెక్షన్లలో రైళ్ల వేగాన్ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. జోన్ పరిధిలోని సరుకు రవాణా, రైళ్ల నిర్వహణ భద్రతపై ఆయన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
సరుకు రవాణా పురోగతికి కృషిచేస్తున్న అన్ని డివిజన్ల పనితీరును ఆయన అభినందించారు. మరింత సరుకు రవాణా లోడింగ్‌కు ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగించుకోవాలన్నారు. జోన్ పరిధిలో రైళ్ల నిర్వహణలో భద్రతపై చర్చించారు. భద్రతా సిబ్బందితో పాటు లోకో పైలట్లకు, అసిస్టెంట్ లోకో పైలట్లకు క్షేత్రస్థాయిలో సెమినార్లు నిర్వహించాలని సూచించారు. అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. దీనితోపాటు సిబ్బందికి వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని జీఎం అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: minister ktr: 'వ్యవసాయ పొలంలో ఇల్లు కట్టుకోవటం తప్పా'