South central railway annual income increased : సికింద్రాబాద్.. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే మొదటిసారిగా ప్రయాణికుల ఆదాయంలో 5000 కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జించి ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. జోన్లో ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా 5,000.81 కోట్ల రూపాయాలు ఆర్జించింది. ఇది 2019-20లో నమోదైన ఉత్తమ ఆదాయము 4,119.44 కోట్ల రూపాయాల కంటే రూ. 881,37 కోట్లు అధికం. అనగా గత ఆదాయం కంటే 21% ఎక్కువ. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎక్కువ సర్వీసులు నడపడం, వివిధ విభాగాల మధ్య సిబ్బంది సమన్వయంతో పాటు సమష్టి కృషి వలన జోన్‌లోని ప్యాసింజర్ సెగ్మెంట్‌లో ఈ కొత్త మైలురాయిని చేరుకునేందుకు సాధ్యమైంది.
South Central Railway ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5,000 కోట్ల రూపాయాల ప్రయాణికుల ఆదాయాన్ని నమోదు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వే సిబ్బందిని అభినందించారు. వివిధ శాఖల మధ్య పటిష్టమైన సమన్వయం అందుబాటులో ఉన్న వనరులను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం వల్ల మంచి ఫలితం లభించిందని ఆయన పేర్కొన్నారు.
కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ రైళ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి దక్షిణ మధ్య రైల్వే జోన్ నిరంతరం ప్రయాణీకుల రద్దీని సమీక్షిస్తోంది. భారతీయ రైల్వేలలో 100% మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తిరిగి ప్రవేశపెట్టిన మొదటి జోన్‌లలో దక్షిణ మధ్య రైల్వే ఒకటి. ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం, కోచ్‌లను శాశ్వతంగా, తాత్కాలికంగా పెంచడం సాధారణ రైళ్ల రాకపోకల స్థితిని పెంచడం వంటి ఇతర చర్యలు దీనికి ఉపకరించాయని రైల్వే పౌర సంబంధాల అధికారి రాకేశ్ తెలిపారు.
పండుగలు మరియు సెలవుల వేళల్లో ప్రయాణీకుల నుంచి అదనపు డిమాండ్‌ను తీర్చడానికి, దసరా, దీపావళి, శబరిమలై, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి, హోలీ ఇలా మొదలైన పండుగలకు దక్షిణ మధ్య రైల్వే 3,543 ప్రత్యేక రైళ్లను నడపడం ద్వారా 30.42 లక్షల మంది ప్రయాణికులను వివిధ నిర్దేశిత సమయంలో గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ.219.80 కోట్ల అదనపు ఆదాయం ఆర్జించింది.
ఇవీ చదవండి: