రాష్ట్రంలో త్వరలో ప్రజారవాణా పట్టాలెక్కనుంది.. ప్రత్యేక సర్వీసుల పేరుతో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే బెంగళూరులో ఆదివారం నుంచి బస్సు సేవలు మొదలయ్యాయి. ఇక నగరంలోనూ బస్సులను తిప్పేందుకు టీఎస్‌ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. సీట్ల సర్దుబాటు ఎలా ఉండాలి.. టిక్కెట్ వసూలు చేయడం ఎలా..? అన్ని బస్టాపుల్లో ఆపాలా.. కరోనా నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై చర్చలు జరుగుతున్నాయి. సోమవారం ఈ మేరకు ఎండీ సునీల్‌శర్మతో సంబంధిత ఆర్టీసీ అధికారులు సమావేశమై చర్చించారు. ప్రజారవాణాను ఎలా ప్రారంభించాలనేదానిపై ఒకటి, రెండు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుంచారు. వాటిలో దేనికి అంగీకారం తెలిపితే అలా బస్సులు నడపాలని నిర్ణయించారు.
బస్టాపులోనే టికెట్..!
బెంగళూరులో బస్సు పాస్‌లనే అనుమతిస్తున్నారు. నగరంలో కూడా అదే విధానాన్ని పాటించాలా..? లేక బస్టాపులోనే కండక్టర్‌ను ఉంచి.. టిక్కెట్లను జారీ చేశాక ప్రయాణికులు బస్సులు ఎక్కేలా ఏర్పాట్లు చేయాలా..? బస్సు వెనుక డోర్ నుంచి ఎక్కి.. ముందు డోర్ నుంచి దిగేలా చేస్తే సరిపోతుందా అనేవి కూడా ప్రతిపాదనల్లో ఉన్నాయి. కండక్టర్ బస్సులోనే ఉండి.. వెనుక డోర్ దగ్గర టిక్కెట్లు జారీ చేస్తే బాగుంటుందేమో అనే ప్రతిపాదనా వచ్చినట్లు తెలిసింది. కరోనా వేళ.. కండక్టర్, డ్రైవర్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాలు సాగించడం ఎలా అనేదానిపై కసరత్తు జరిగింది. సాధ్యమైనంత తర్వలో బస్సులు రోడ్డెక్కే సూచనలున్నాయి.
ప్రయాణికులకు బస్సులందేనా..
సిటీ బస్సులో 48 సీట్లుంటాయి. ప్రస్తుత తరుణంలో సగం మందినే అనుమతించి సర్వీసులను నడిపితే.. బస్టాపుల్లో ప్రయాణికులను ఎవరు నియంత్రిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. హైదరాబాద్ మహా నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య 32 లక్షల వరకు ఉంది. సగం సీట్లకే పరిమితం చేస్తే.. ప్రస్తుతం ఉన్న 2,850 బస్సులు చాలవు. ఇలాంటి తరుణంలో ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వం, అధికారులు ఆలోచించాల్సి ఉంది.
ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా 'విత్తన మేళా'కు రంగం సిద్ధం