కొవిడ్ రెండో దశలో వైరస్ విజృంభిస్తున్నందున చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని కరీంనగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త శ్యామ్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వైరస్ బారిన పడి పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బులు కట్టలేక ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కరోనా సోకిన ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆస్పత్రిలో చేరాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందని.. ప్రైవేటు ఆస్పత్రుల అరాచకాలకు అడ్డుకట్ట వేయలేకపోతోందని ఆరోపించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. పేదల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన్నారు. తన నిరసనతోనైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని ఆశిస్తున్నట్లు శ్యామ్ కుమార్ తెలిపారు.