పేదరికం కారణంగా ఉపాధి కోసం అన్వేషణలో భాగంగా దేశంలో అంతర్గత వలసలు గణనీయంగా పెరిగాయని యంగ్ లైవ్స్ ఇండియా సంస్థ వెల్లడించింది. వలస జీవుల్లోని ప్రతి ఐదుగురిలో ఒకరు బాలలే అని వెల్లడించింది. వలసల వల్ల బాలలు చదువు మధ్యలోనే మానేస్తూ కుటుంబాలకు సహాయ పడుతున్నారని పేర్కొంది. బాలకార్మిక వ్యవస్థకు పేదరికం, అల్పాదాయమే ప్రధాన కారణాలని తెలిపింది. దేశంలో ‘బాలల వలసలు - 2020’ అధ్యయన నివేదికను ఆ సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌కు అనుబంధంగా పనిచేస్తుంటుంది. ఈ సంస్థ, యునిసెఫ్ సంయుక్తంగా మన దేశంలోని బాలల వలసలపై అధ్యయనం చేశాయి.
జనాభా లెక్కలు, కుటుంబ సర్వే ఆధారంగా వలసలు, పిల్లలపై ప్రభావం అంచనా వేశాయి. గత పదేళ్లలో అంతర్గత వలసల్లో చిన్నారుల సంఖ్య రెండింతలైందని ‘యంగ్ లైవ్స్’ నివేదిక వివరించింది. గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాలు వలసలకు ప్రధాన కారణమని, కుటుంబం, బాధ్యతల కారణంగా ఆదాయం, ఉపాధి కోసం కుటుంబాలతో సహా పట్టణాలకు వెళ్తుంటారని తేల్చింది.. బడుగు, బలహీన వర్గాలవారు ఉపాధి, కూలి పనుల కోసం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు వెళ్తుంటారు. ఇలాంటి కుటుంబాల్లోని ఐదేళ్లలోపు చిన్నారులు ఎదుగుదల లోపం, ఎత్తుకు తగిన బరువు లేకపోవడంతో పాటు డయేరియా వంటి జబ్బులతో బాధపడుతున్నట్లు తేల్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు మెరుగైన విద్యావకాశాలు కల్పిస్తే ఇలాంటి వలసలను నివారించవచ్చని సూచించింది.
అధ్యయనంలో వెల్లడైన విషయాలు.
- పిల్లల చదువులు, ఉపాధికోసం వలసలు ఎక్కువగా ఉంటున్నాయి.
- వలస వెళ్లిన 10-19 ఏళ్ల బాలికల్లో ప్రతి పదిమందిలో ఐదుగురికి బాల్య వివాహాలయ్యాయి.
- 6-18 ఏళ్లలోపు చిన్నారులు బాలకార్మికులుగా మారుతున్నారు.
- వలస పేదకుటుంబాల్లోని చిన్నారులకు సరైన విద్యావకాశాలు దొరకడంలేదు.
ఇలా చేయాలి..
- 14 ఏళ్లలోపు చిన్నారులు పనుల్లోకి వెళ్లకుండా బాలకార్మిక చట్టాలు సమగ్రంగా, పటిష్ఠంగా అమలు చేయాలి.
- గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమన్వయంతో కృషి చేయాలి.
- బాల్యవివాహాలను అరికట్టాలి.
- వలస చిన్నారులకు విద్యాబుద్ధులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి.
- వలస కేంద్రాలుగా గుర్తించిన ప్రాంతాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి.
ఇవీ చూడండి: మీ ఇంట్లోనే కరోనా చికిత్స.. వైరస్ నుంచి బయటపడే మార్గం