ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఈనెల 25 నుంచి ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వైకుంఠధామం, డంప్ యార్డుల చుట్టూ ప్రహరీ గోడలు కాకుండా ఎత్తైన చెట్లు పెంచి వాటితో గ్రీన్ వాల్ నిర్మించాలని సీఎం సూచించారు. సామాజిక అడవులు ఎంత పెంచినా సహజ సిద్ధ అడువులకు సాటిరావని అందుకే అడవుల పునరుద్ధరణకు, ఉన్న అడవులను కాపాడేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
నిర్మల్, ఆసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, అచ్చంపేట, మెదక్ తదితర జిల్లాల్లో ఉన్న అడవిని కాపాడాలని పేర్కొన్నారు. కలప స్మగ్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని.. స్మగ్లర్లను గుర్తించి వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మియావాకి పద్ధతిలో ప్రాధాన్యత..
అటవీ ప్రాంతాల్లో చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అధిక జనాభా, అధిక కాలుష్యం, తక్కువ అటవీ ఉండే పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచాలని కోరారు. మున్సిపాలిటీల్లో పచ్చదనానికి కేటాయించిన పది శాతం నిధులను వినియోగించుకోవాలన్నారు. రహదారుల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో చెట్ల పెంపకంతో పాటు, వ్యవసాయ క్షేత్రాల్లోని ఖాళీ ప్రదేశాల్లో కూడా చెట్లను పెంచాలన్నారు. తక్కువ సమయంలో, తక్కువ విస్తీర్ణంలోనే ఏపుగా పెరిగే లక్షణం ఉన్న మియావాకి పద్ధతిలో చెట్లను పెంచాలన్న సీఎం కొండ, పట్టణ ప్రాంతాల్లో ఈ పద్ధతిని అవలంభించాలని వివరించారు.