Commercial Tax Collections: రాష్ట్రంలో పన్నుల రాబడి అనూహ్యంగా పెరుగుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నెలలో వచ్చిన రాబడితో పోలిస్తే ఈ సారి 5 శాతం తగ్గుదల నమోదైంది. కానీ గడిచిన 11 నెలల్లో వచ్చిన ఆదాయం.. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 27 శాతం అధికంగా వచ్చింది. ఈ ఏడాది జనవరిలోనే గత ఆర్థిక ఏడాది ఆదాయాన్ని అధిగమించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు రూ. 58 వేల 261 కోట్ల పన్ను రాబడి వచ్చింది. గత ఆర్థిక ఏడాది మొత్తం రాబడి కన్నా ఇది 11 శాతం అధికమని గణాంకాలు చెబుతున్నాయి.
చమురు ఉత్పత్తులపై...
పెట్రోల్ ఉత్పత్తుల అమ్మకాలపై వచ్చిన వ్యాట్ 56 శాతం వృద్ధితో రూ. 12 వేల143 కోట్లుగా ఉంది. అదే మద్యం విక్రయాలపై వచ్చిన వ్యాట్ 17 శాతం వృద్ధితో రూ. 12 వేల 315 కోట్లుగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు ఏడాదిలో వచ్చిన జీఎస్టీతో పోలిస్తే... 18 శాతం వృద్ధితో రూ. 27 వేల 543 కోట్లు వచ్చింది. ఫిబ్రవరి నెలలో జీఎస్టీ పరిహారం రూపాయి కూడా రాలేదు.
మరో 6,738 కోట్లు వస్తే...
మార్చి ఆర్థిక సంవత్సరం ముగింపు నెల కావడంతో... పన్నుల వసూళ్లు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పాత బకాయిల వసూళ్ల కోసం వాణిజ్య పన్నుల శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యాచరణతోపాటు పన్ను ఎగవేతదారులకు నోటీసులు ఇవ్వడం ద్వారా సాధారణంగా వచ్చే ఆదాయం కంటే ఎక్కువ వస్తుందని ఆ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 65 వేల కోట్లు మేర రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. మార్చ్‌లో మరో రూ. 6,738 కోట్లు వస్తే తాము అనుకున్నంత ఆదాయం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఒకే ట్రాక్‌పై.. ఎదురెదురుగా రైళ్లు.. వాటిల్లో రైల్వే మంత్రి, రైల్వేబోర్డు ఛైర్మన్