షీ టీం పోలీసుల పనితీరు పట్ల ఫిర్యాదుదారుల్లో 96శాతం సంతృప్తి వ్యక్తం చేశారని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా తెలిపారు. దీనిని 100శాతానికి తీసుకెళ్లేలా షీ టీం పోలీసులకు దిశా నిర్దేశం చేసినట్లు ఆమె వెల్లడించారు. మహిళలు, యువతులను వేధించే పోకిరీలకు ప్రత్యక్ష కౌన్సిలింగ్ విధానం ద్వారానే కాకుండా మహిళా భద్రతా విభాగం నుంచి ఆన్ లైన్లో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. వేధింపులకు పాల్పడితే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో పోకిరీలకు వివరిస్తున్నారు.
ఈమధ్య కాలంలో ఫోన్లో, సామాజిక మాధ్యమాల్లో, నేరుగా వేధింపులకు పాల్పడుతున్న 114 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సెప్టెంబర్లో ప్రవేశపెట్టిన ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానం ద్వారా 470 మందికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీఐజీ సుమతి తెలిపారు. 17 జిల్లాల నుంచి షీటీం పోలీసులు ఆన్లైన్ ద్వారా పోకిరీలకు కౌన్సిలింగ్ ఇప్పించారని పేర్కొన్నారు. ఆకతాయిల ఆటకట్టించడంలో హైదరాబాద్ షీటీం పోలీసులు ముందు వరుసలో ఉన్నారని.. గ్రామాల్లోని మహిళలకు షీ టీం పట్ల అవగాహన కల్పిస్తున్నామని డీఐజీ చెప్పారు.
ఇదీ చదవండి: మహిళలకు మరుగుదొడ్లు, శిశువులకు పాలిచ్చే కేంద్రాలు