కరోనా పాజిటివ్ కేసులతో హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రిలో కలకలం మొదలైంది. ఆస్పత్రిలోని ఏడుగురు వైద్య సిబ్బందికి కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడం వల్ల రోగులు, వైద్యులు భయాందోళనకు గురవుతున్నారు. నలుగురు కార్డియాలజీ రెసిడెంట్ డాక్టర్లు, ముగ్గురు సిబ్బందికి కరోనా సోకింది. అప్రమత్తమైన ఆస్పత్రి వర్గాలు కొన్ని విభాగాలకు సంబంధించిన రోగులను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తున్నారు.
కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం వల్ల నిమ్స్ ఆసుపత్రిలోని అన్ని విభాగాధిపతులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. కార్డియాలజీ రెసిడెంట్ డాక్టర్లు కరోనా నిర్ధరణ కాకముందు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారని... ఎవరెవరికి వైద్యం చేశారు..ఏయే విభాగాలను క్వారంటైన్‌లో ఉంచాలన్న దానిపై సమావేశంలో చర్చించారు.