Jumbo Committees in Congress: కాంగ్రెస్‌లో పీసీసీ జంబో కమిటీ అసంతృప్తి జ్వాల చల్లారడం లేదు. ఏఐసీసీ ఈనెల 10న పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, ఎగ్జిక్యూటీవ్ కమిటీతోపాటు 26 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను నియమించింది. పదవులు వచ్చిన వారు.. రాని వారు ఇద్దరూ అసంతృప్తి వ్యక్తం చేస్తునే ఉన్నారు. కమిటీల్లో ఎక్కడో ఒకచోట అవకాశం దక్కించుకున్నప్పటికీ.. ప్రాధాన్యం లేని వారితో కలిసి ఇచ్చారన్న భావనతో కొందరు ఉన్నారు.
రాజకీయ వ్యవహారాల కమిటీలో తన పేరు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి కొండా సురేఖ.. పీసీసీ కార్యనిర్వాహక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్యనాయక్ రాష్ట్ర కమిటీలో తనకు అవకాశం కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కమిటీలను ఏకపక్షంగా ప్రకటించారని పలువురు సీనియర్లు బహిరంగానే ప్రకటిస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకునేందుకువీలున్న కార్యనిర్వహక కమిటీ జాబితాలో సీనియర్టీపరంగా పేర్లు పెట్టకపోవడంపైనా పెదవి విరుస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో డీసీసీ అధ్యక్షుల నియామకం, ఇతర పదవుల ఎంపికపై పార్టీ సీనియర్‌నేత దామోదర రాజనర్సింహ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ కాంగ్రెస్‌కు కోవర్టు రోగం పట్టుకుందని.. ఆరోపణలు చేశారు.
ఏఐసీసీ ప్రకటించిన పీసీసీ కమిటీల ఎంపికలో అసలు ప్రాతిపదిక ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకోవాలని సోమవారమే ఆయన గాంధీభవన్ కు వెళ్లారు. అక్కడ విలేకరులతో మాట్లాడేందుకు యత్నించగా ముఖ్యనేతలు నిలువరించారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని కోవర్టులకు పదవులు వచ్చాయని ఆరోపించారు.
పీసీసీ కమిటీల కూర్పుపై పార్టీ శాసనసభా పక్షాన్ని భాగస్వామ్యం చేయకపోవడంపై పలువురు నేతలు నిరసన వ్యక్తంచేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇదే వాణి వినిపించారు. కమిటీల ఏర్పాటులో పీసీసీతోపాటు సీఎల్పీకి కూడా అంతే భాగస్వామ్యం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి.. ఓయూ నేతలు.. సోమవారం సమావేశమయ్యారు. అసంతృప్తుల విషయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తానని భట్టి తెలిపారు.
కమిటీలో చోటు దక్కకపోవడంపై తనకు పదవులు ముఖ్యం కాదని పార్టీ మరో సీనియర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏఐసీసీ ప్రకటించిన జంబో కమిటీ ఇరాకాటంలో పడేసింది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలలు సమయం ఉన్న వేళ.. అసంతృప్తులు ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నిరసనలు మరింత ముదరకముందే అధిష్ఠానం సయోధ్య కుదిర్చే ప్రక్రియను చేపట్టాలని నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి: