కరోనా పాఠశాలకు తాళం వేయించింది. స్నేహితులను, పుస్తకాలను దూరం చేసింది. ఇక పాఠశాలలోనే నిర్వహించే వేడుకలు జ్ఞాపకాలుగానే మిగిల్చింది. అలాంటి తరుణంలో గణతంత్ర దినోత్సవాన్ని తమకున్న వనరులతో ఘనంగా నిర్వహించారు ఆ చిన్నారులు.
ఏటా జనవరి 26 వచ్చిందంటే... తమకున్నంతలో మంచిగా తయారై పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొనే వారు ఆ చిన్నారులు. కానీ కరోనా ప్రభావం వల్ల పాఠశాల మూత పడడం వల్ల.. ఎలాగైనా వేడుకలు చేసుకోవాలనుకున్న చిన్నారులు ఇలా జరుపుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరున్న సికింద్రాబాద్ అడ్డగుట్టలోని ఆర్‌ఆర్‌సీ మైదానం వెళ్లే రోడ్డులో అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన కొందరు చిన్నారులు ఓచోట చేరి గణంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఉదయాన్నే అప్పటికప్పుడు వేడుకలు చేసుకుందామని అనుకుని కనీసం జెండా కూడా లేకపోవడం వల్ల పరీక్ష అట్టపై జాతీయ జెండా అమర్చి.. చుట్టూ స్టేషనరీ వస్తువులు పెట్టి వేడుక చేసుకున్నారు.
జాతీయ దినోత్సవాలైనా.. పండుగలైనా.. కేవలం సెలవురోజుగానే భావిస్తున్న కొందరున్న నేటి రోజుల్లో... కనీస వసతులు లేకపోయినా గణతంత్ర దినోత్సవాన్ని తమకున్న వనరులతో ఘనంగా నిర్వహించిన ఈ చిన్నారులు ఎందరికో ఆదర్శం.
ఇదీ చూడండి: కొత్త సచివాలయ పనులను పరిశీలించిన సీఎం