రిటర్నింగ్ అధికారులు నిబంధనలను పూర్తి స్థాయిలో ఆకళింపు చేసుకొని... ఓట్లలెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులతో ఎస్ఈసీ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
సంపూర్ణ ఆధిపత్యం వారిదే..
రిటర్నింగ్ అధికారులు లెక్కింపు కేంద్రంపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉండాలని పార్థసారథి సూచించారు. రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని, అందరినీ సమన్వయ పరచుకొని బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని తెలిపారు. ఉదయం ఏడున్నర వరకు అధికారులు, సిబ్బంది కేటాయించిన స్థానాల్లో ఉండాలన్న ఆయన... అనుమతి లేని వ్యక్తులెవరూ కౌంటింగ్ హాల్లో ఉండకూడదని స్పష్టం చేశారు.
వారి ఆమోదం పొందాకే..
పరిశీలకుల ఆమోదం పొందిన తర్వాతే ఎన్నికల ఫలితాలను రిటర్నింగ్ అధికారి ప్రకటించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించాలని సూచించారు. సందేహాత్మక బ్యాలెట్ పత్రాలపై రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని వెల్లడించారు. ప్రతి రౌండు అనంతరం ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ ఏజెంట్ల సంతృప్తి మేరకు వారి సంతకాలు సేకరించాలన్నారు. కొవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని... కౌంటింగ్ సిబ్బంది మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పక ధరించాలని పార్థసారథి తెలిపారు.
ఇదీ చూడండి: ఏర్పాట్లు పూర్తి.. మొదటి ఫలితం వెలువడేది అక్కడే!