ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ సందర్భంగా తామెప్పుడూ పోలింగ్ సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తామని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ తెలిపారు. ‘స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు మనమంతా కలిసికట్టుగా పనిచేద్దాం. ఎన్నికల సంఘం మార్గదర్శకత్వంలో ఉద్యోగుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది’ అని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. క్లిష్టమైన సవాళ్లను దీటుగా ఎదుర్కోవడంలో ఏపీ సివిల్ సర్వీసెస్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉందని గుర్తుచేశారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తొలి ప్రాధాన్యం కింద కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని కోరామని... దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించాలని కోరారు. ఎన్నికల సిబ్బందికి నాణ్యమైన పీపీఈ సూట్లు, ఫేస్‌షీల్డులు, గ్లవ్స్, క్రిమిసంహారకాల వంటివి అందజేయాలని ప్రభుత్వానికి సూచించామని వివరించారు. కొవిడ్ నుంచి రక్షణ సంబంధిత శిక్షణ కూడా ఇవ్వాలని సూచించామని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు ఈ చర్యలు చేపట్టామని తెలిపారు. ‘ఇందులో భాగంగానే ఇటీవల జారీ చేసిన ప్రొసీడింగ్స్‌లో కొవిడ్ నుంచి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ ప్రస్తావించాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శితో ఈనెల 8న మా కార్యాలయంలో జరిగిన చర్చల్లోనూ ఎన్నికల సిబ్బంది కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పాం’ అని ప్రకటనలో వివరించారు.
ఎన్నికల నిర్వహణ రాజ్యాంగబద్ధమైన విధి
‘రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సంఘానికి నిరంతరం అందుబాటులో ఉన్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుకూలమనే అభిప్రాయాన్ని ఆయా పార్టీలు వ్యక్తం చేశాయి. క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికల పట్ల ఎంతో ఉత్సుకత ఉందని ఆయా పార్టీలు వివరించాయి. గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరిగేవి. సకాలంలో నిర్వహణతో ఆర్థిక సంఘం నిధుల విడుదల ముడిపడి ఉంది. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగబద్ధమైన విధి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని రాబోయే నెలల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి’ అని ప్రకటనలో వివరించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో టీకా పంపిణీకి శరవేగంగా ఏర్పాట్లు