జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు తెరిచే తాత్కాలిక కార్యాలయాల కోసం సంబంధిత డిప్యూటీ కమిషనర్ల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాలు తెరిచేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేస్తే స్థానిక పోలీసు అధికారులను సంప్రదించి నిబంధనల ప్రకారం అనుమతి మంజూరు చేయాలని డీసీలకు ఎన్నికల సంఘం తెలిపింది.
పబ్లిక్ లేదా ప్రైవేటు ఆస్తుల్లో బలవంతంగా కార్యాలయాలను తెరవరాదని... మతపరమైన స్థలాలు, వాటి ఆవరణల్లో కార్యాలయాలు తెరవరాదని స్పష్టం చేసింది. విద్యా సంస్థలు, ఆసుపత్రుల సమీపంలో, పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపు కార్యాలయం తెరువరాదని ఎస్ఈసీ తెలిపింది. ఏర్పాటు చేసే కార్యాలయంపై ఒక పార్టీకి సంబంధించిన జెండా, బ్యానర్, ఫోటోలు లేదా గుర్తులు మాత్రమే ప్రదర్శించాలని... జెండా కూడా నాలుగు అడుగులు, ఎనిమిది అడుగుల విస్తీర్ణాన్ని మించి ఉండరాదని స్పష్టం చేసింది.
- ఇదీ చూడండి: దమ్ముంటే సమాధులు కూల్చండి: అక్బరుద్దీన్