SBI Chairman Appreciation: హైదరాబాద్ సర్కిల్ పరిధిలో బ్యాంకు అధికారుల పనితీరును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ దినేష్ ఖరా అభినందించారు. అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ఆయన కొనియాడారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ దినేష్ ఖరా వివిధ అధికారిక కార్యక్రమాలల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఆదివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో... రాష్ట్రంలోని ఏస్బీఐ రీజినల్ మేనేజర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లతో సమావేశమైన ఆయన గడిచిన తొమ్మిది నెలల బ్యాంకుల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు సమయం ఉన్నందున మరింత సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. ఖాతాదారులకు అందించే సేవలు మరింత దగ్గరగా ఉండేటట్లు చూడాలని అధికారులను ఆదేశించారు. వివిధ సేవలకోసం బ్యాంకులకు వచ్చే ఖాతాదారులను ఆకర్షించే విధంగా సేవలు ఉండాలని, ఇబ్బందులకు గురి కాకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. కొవిడ్ సేవలు విస్తృతంగా అందించే ఆస్పత్రులకు చేయూతనివ్వాలని తమ బ్యాంక్ నిర్ణయించిందని ఆయన తెలిపారు.
ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా క్యాపిటల్ ఇంటెన్సివ్ యాక్టివిటీస్ కోసం బ్యాంక్ విరాళం అందిస్తుందని దినేష్ ఖరా అన్నారు. ప్రజలకు వైద్య మౌలిక సదుపాయాలను పెంపొందించడం కోసం బ్యాంక్ తరఫున ఎమర్జెన్సీ రెస్పాన్స్ అంబులెన్స్ వాహనాలను రెండింటిని హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్, అపోలో హాస్పిటల్‌కు ఒక్కొక్కటి అందించారు. పూర్తి మెడికల్ ఎక్విప్మెంట్తో కూడిన ఒక్కో అంబులెన్స్‌కు... 20 లక్షల చొప్పున 40 లక్షలు కేటాయించినట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి: మారిన బ్యాంక్ రూల్స్.. కొత్త నిబంధనలు ఇవే..