దిల్లీ లిక్కర్ స్కామ్‌లో శరత్ చంద్రారెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.2లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. శరత్‌చంద్రారెడ్డి నానమ్మ అంత్యక్రియల దృష్ట్యా బెయిల్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దిల్లీ మద్యం కుంభకోణంలో శరత్‌చంద్రారెడ్డే కీలక సూత్రధారని.. మొత్తం మార్కెట్‌లో 30శాతానికిపైగా దక్కించుకోవడంతో పాటు, దక్షిణాది రాష్ట్రాల నుంచి టెండర్లు చేజిక్కించుకున్నవారితో సౌత్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు ఈడీ పేర్కొంది. బినామీ కంపెనీల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా 9 రిటైల్ జోన్స్ దక్కించుకున్నారని, అందుకోసం భారీగా ముడుపులు చెల్లించినట్లు తెలిపింది. సౌత్ గ్రూప్‌కు సంబంధించి 100 కోట్లు.. విజయ్‌నాయర్ ద్వారా ముడుపులు చెల్లించినట్లు వెల్లడించింది.
అసలేం జరిగింది: శరత్‌కు చెందిన 3కంపెనీల ద్వారా 64.35కోట్లు ఇప్పటికే అక్రమంగా సంపాదించినట్లు ఈడీ వివరించింది. ఇందులో 60కోట్లు ఇండో స్పిరిట్స్ కంపెనీకి తరలించినట్లు విచారణలో బయటపడినట్లు ఈడీ పేర్కొంది. మొత్తం వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరకకుండా చేసేందుకు .. డిజిటల్ సర్వర్లలోని సమాచారాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. దర్యాప్తు ప్రారంభం అయిన తర్వాత.. క్రెడిట్ నోట్లు వెనక్కి తీసుకున్నట్లు నకిలీపత్రాలు సృష్టించినట్లు రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ నుంచి 200కోట్ల బ్యాంకు గ్యారెంటీలను ఇండో స్పిరిట్స్‌కు ఇచ్చారు.
ట్రైడెంట్ ఛాంపర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్గనోమిక్స్ ఎకోసిస్టమ్స్, శ్రీఅవంతిక కాంట్రాక్టర్స్ ద్వారా శరత్ నేరుగా కార్యకలాపాలు జరిపినట్లు ఈడీ భావించింది. అంతేకాక... గ్రూపు సభ్యులుగా మరో 4జోన్లు కూడా అదుపు చేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు 169 సార్లు జరిపిన సోదాల్లో.. పెద్దమొత్తంలో డిజిటల్, భౌతిక ఆధారాలు లభ్యం అయినట్లు దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. ప్రజాభిప్రాయ సేకరణకు ముందే బినోయ్ బాబుకు ఈ-మెయిల్ ద్వారా దిల్లీ మద్యం విధానపత్రం లభించిందని.. తద్వారా ఏవిధంగా తదుపరి చర్యలు తీసుకోవాలో ముందుగానే నిర్ణయించుకున్నారని ఈడీ ఆరోపించింది. దర్యాప్తునకు సహకరించనందునే శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది.
ఇవీ చదవండి: