సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు.. రకరకాల పిండి వంటలు.. ఆకర్షించే గాలిపటాలతో ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. పతంగులకు ప్రత్యేకం సంక్రాంతి. ఈ పండుగ వచ్చిందంటే చాలు మార్కెట్‌లో విభిన్న రకాల పతంగులు దర్శనమిస్తాయి. వీటిని ఎగుర వేసేందుకు చిన్నాపెద్దా ప్రతి ఒక్కరూ పోటీపడతారు. పండుగకు వారం ముందు నుంచే గాలిపటాల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. ఈ ఏడాది కూడా పతంగుల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ప్రధాని మోదీ, సినీ నటుల చిత్రాలతో ముద్రించిన గాలిపటాలు మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఒక్క రూపాయి మొదలుకుని..: ప్రస్తుతం మార్కెట్‌లో ఒక రూపాయి నుంచి మొదలుకొని రూ.వంద వరకు గాలిపటాలు లభిస్తున్నాయి. ఆకర్షణీయమైన రంగురంగుల గాలిపటాలను వివిధ జిల్లాల నుంచి వ్యాపారులు నగరానికి వచ్చి విక్రయిస్తున్నారు. కొవిడ్ కారణంగా గడిచిన రెండు సంవత్సరాలుగా పెద్దగా పండుగ జరుపుకోలేదని.. ఈ ఏడాది పెద్ద ఎత్తున పతంగులు ఎగురవేస్తూ ఆనందోత్సహాల మధ్య సంక్రాంతిని జరుపుకుంటామని వినియోగదారులు చెబుతున్నారు. అంతేగాక ఈసారి మార్కెట్‌లో రిమోట్‌తో పని చేసే చర్కా అందుబాటులోకి వచ్చింది. రిమోట్ మీట నొక్కితే చాలు చర్కా.. దానంతట అదే దారం చుడుతుంది. గాలిపటం ఎగురవేయడానికి దారం వదులుతుంది. ఈ తరహా రిమోట్ చర్కా కొనుగోలుకు గాలిపటాల ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు గతంతో పోలిస్తే పతంగుల వ్యాపారం బాగా తగ్గిపోయిందని, విద్యార్థులకు సంక్రాంతి సెలవులు కొద్ది రోజులు మాత్రమే ఇవ్వడం దీనికి కారణమని వ్యాపారస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.