samatha kumbh 2023: సమతా స్ఫూర్తి కేంద్రానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఫిబ్రవరి 2న సమతామూర్తి మొదటి వార్షికోత్సవం జరుపుతున్నట్లు చినజీయర్‌స్వామి తెలిపారు. రామానుజచార్యుల అభిషేకంతో కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 5న 108 మంది దేవతామూర్తులకు కల్యాణం నిర్వహిస్తామని వెల్లడించారు. ఆ రోజున సామాన్యుల కోసం దేవుడే దిగి వస్తాడని అన్నారు. వేదానికి ప్రతీక గరుత్ముతుడన్న చినజీయర్ స్వామి.. ఫిబ్రవరి 11న లక్ష మందితో భగవద్గీత పారాయణం చేయిస్తున్నట్లు వివరించారు. భగవద్గీతపై చిన్నారుల మేథాశక్తి ప్రదర్శన ఉంటుందని వివరించారు. సమతా కుంభ్ ద్వారా సమతా సందేశాన్ని వ్యాప్తిచేద్దామని పిలుపునిచ్చారు.
రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత రాజకీయాలు మాని ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడాలని చినజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతున్న తరుణంలో అందరి మధ్య సమతాభావం పెంపొందించే లక్ష్యంతోనే సమతాస్ఫూర్తి కేంద్రాన్నిఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు వేరు వేరు సిద్ధాంతాలుంటాయన్న చినజీయర్‌స్వామి.. ఆ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడానికి అందరూ కలిసి పనిచేయాలనేది కోరుకుంటున్నట్లు వెల్లడించారు.