Fake Sim Cards: "సిమ్‌కార్డులు కావాలా తీసుకోండి.. వంద, వెయ్యి.. ఎన్నైనా సరే ఇస్తాం" అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ తప్పుడు గుర్తింపు పత్రాలతో పొందిన సిమ్‌కార్డులను వేలసంఖ్యలో విక్రయిస్తున్నారు. ఇవి దుర్వినియోగం అవుతున్నాయన్న సమాచారంతో కేంద్ర నిఘావర్గాలు గతేడాది జనవరి నుంచి నిఘా పెట్టాయి. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, దిల్లీ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఇలాంటి సిమ్‌కార్డులను వినియోగిస్తున్నారని తెలుసుకున్నాయి. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించగా.. ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు ఆయా రాష్ట్రాల్లో అక్రమంగా సిమ్‌కార్డులు విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. కొన్ని సెల్‌ఫోన్ నెట్‌వర్క్ కంపెనీలు లక్ష్యాలను చేరేందుకు కమీషన్ ఎక్కువగా ఇస్తామంటూ గంపగుత్తగా ఏజెంట్లకు ఇస్తున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి.
రూట్‌కాలింగ్ కేంద్రం.. మూడు వేల సిమ్‌కార్డులు..
హైదరాబాద్, దిల్లీ, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరుల నుంచి విదేశాలకు ఎక్కువగా కాల్స్ వెళ్తున్నాయంటూ కేంద్ర నిఘావర్గాలకు సమాచారం అందింది.. బెంగళూరుకు సమీపంలోని ఓ సైనిక కార్యాలయం నుంచి దుబాయ్‌కి ఫోన్‌కాల్స్ వెళ్లడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీగ లాగితే రూట్‌కాలింగ్ కేంద్రాల నిర్వాహకులు, సైబర్ నేరస్థులు వేల సంఖ్యలో సిమ్‌కార్డులను మారుపేర్లలో ఉపయోగిస్తున్నారని తేలింది. వారి పరిశోధన కొనసాగుతుండగానే సికింద్రాబాద్‌లో రూట్‌కాలింగ్ కేంద్రం నిర్వహిస్తున్న ఎర్నాకుళం వాసి మహ్మద్ రసూల్‌ను హైదరాబాద్ పోలీసులు ఆర్నెల్ల క్రితం అరెస్ట్ చేశారు.
దుబాయ్, మస్కట్‌లతో పాటు ఇతర దేశాలకు ఫోన్‌కాల్స్ చేస్తున్నాడని గుర్తించారు. రూట్‌కాలింగ్ నిర్వహణకు అవసరమైన సిమ్‌కార్డులను ఎక్కడినుంచి తీసుకుంటున్నావని పోలీసులు ప్రశ్నించగా... టెలిగ్రామ్ మెసెంజర్ ద్వారా వివరాలు తెలుసుకుని కొరియర్‌లో మూడువేల సిమ్‌కార్డులు పంపిచారని చెప్పాడు. ఈ సమాచారాన్ని పోలీసులు కేంద్ర నిఘావర్గాలకు ఇవ్వగా... ఆ సిమ్‌కార్డుల ఆధారంగా దిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో సిమ్‌లు వినియోగిస్తున్న వారి వివరాలు తెలిశాయి. 15 వేల సిమ్‌కార్డులు వారు సమీకరించుకున్నారని గుర్తించాయి.
ఒక ఆధార్.. పదిహేను కలర్ జిరాక్స్‌లు..
సిమ్‌కార్డు ద్వారా వచ్చే కమీషన్‌కు ఆశపడి అక్రమంగా సిమ్‌కార్డులను విక్రయిస్తున్న ఏజెంట్లు ఒక ఆధార్‌కార్డుతో పదీపదిహేను కలర్ జిరాక్స్‌లు తీసుకుంటున్నారు. అనంతరం ఆయా కార్డుల్లో పేర్లు, ఫొటోలు, చిరునామాలను ఇష్టారాజ్యంగా మార్చి సిమ్‌కార్డులను యాక్టివేట్ చేస్తున్నారు. వీటిని సైబర్ నేరస్థులు, రూట్‌కాలింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్న వారికి గంపగుత్తగా అమ్మేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో అస్సాం, నాగాలాండ్, మణిపూర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని మారుమూల జిల్లా కేంద్రాలు, నేషనల్ కాపిటల్ రీజియన్‌లోని మండల కేంద్రాల్లో సిమ్‌కార్డులు విక్రయిస్తున్న ఏజెంట్లు ఇలా చేస్తున్నారని తేలింది. కొద్దిరోజుల క్రితం ఆంధ్రపదేశ్‌కు చెందిన సిమ్‌కార్డులు కూడా హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎవరెవరు వినియోగిస్తున్నారన్న అంశాలపై పరిశోధిస్తున్నారు.
ఇదీ చదవండి: