Safety Tips Diwali Festival 2023 : దీపావళి ( Diwali Festival ) ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ. దివ్వెల పండగంటే అందరికీ ఉత్సాహమే. పిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చేందుకు పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. మరి అలాంటివి జరగకుండా ఉండేదుకు అగ్నిమాపక శాఖ అధికారులు, డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు.
అక్షర్ధామ్ ఆలయంలో దీపావళి వేడుకలు- 'గ్లో గార్డెన్ థీమ్'తో 10వేల దీపాలంకరణ!
Diwali Festival Precautions 2023 : బాణాసంచా విక్రయించే దుకాణదారులు తప్పనిసరిగా దుకాణాల్లో ఇసుక, నీటి బకెట్లతో పాటు అగ్నిమాపక పరికరాలను సిద్దంగా ఉంచుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. అన్నీ అనుమతులు తీసుకోవాలని కోరుతున్నారు. అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఊహించని విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే ఘటనాస్థలానికి వేగంగా చేరుకునేందుకు హైదరాబాద్‌లో దాదాపు 25 అగ్నిమాపక కేంద్రాల్లోని అగ్నిమాపక శకటాలను అందుబాటులో ఉంచామని చెప్పారు.
దీపావళి స్వీట్స్ - పండగను మరింత తియ్యగా జరుపుకోండి!
హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో కలిపి దాదాపు 32 అగ్నిమాపక కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉంటారని అధికారులు చెబుతున్నారు. మరో వైపు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
అగ్నిమాపక శాఖ సూచనలివే..
- అధీకృత తయారీదారీ వివరాలున్న బాణసంచానే ప్రజలు కొనుగోలు చేయాలి
- ఆయిల్ క్యాన్లు, గ్యాస్ సిలిండర్లు తదితర మండే పదార్థాలకు దూరంగా పెట్టాలి
- ఇంట్లో దీపాలు వెలిగించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి
- బాణాసంచా కాల్చేటప్పుడు నూలు, ఖద్దరు బట్టలను మాత్రమే ధరించాలి.
- గాలి వీస్తున్నప్పుడు రాకెట్లు, పైకి ఎగిరేవి కాల్చవద్దు
- కాల్చిన బాణసంచాను నీరు నింపిన బకెట్‌లో వేయాలి
- బకెట్ నిండా నీటిని, దుప్పట్లను సిద్దంగా ఉంచుకోవాలి
- వాహనాలు, ఇళ్లలో టపాసులు కాల్చకూడదు
- ప్రజలు భారీగా శబ్దం చేసే బాణాసంచాను కాల్చకుండా.. పర్యావరణహిత టపాకాయలను మాత్రమే వినియోగించాలి
మరోవైపు టపాసులు కాల్చేటప్పుడు అజాగ్రత్తగా ఉండడం వల్ల కంటికి గాయాలతో ఏటా పదుల సంఖ్యలోనే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు అత్యవసర చికిత్స కోసం వస్తుంటారు. గతే సంవత్సరం సరోజినీదేవి, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రులకే 200 మందిపైగా బాణాసంచా వల్ల గాయపడిన బాధితులు వచ్చారని వైద్యులు తెలిపారు. మరీ అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేదుకు వైద్యులు చెప్పిన ఆ జాగ్రత్తలు ఏమిటో ఒకసారి చూద్దాం.
వైద్యుల సూచనలివే..
ఇవి చేయాలి..
- పిల్లలు బాణాసంచా కాల్చేటప్పుడు నిశితంగా పరిశీలించాలి
- అందరూ ఒకేచోట గుమిగూడి టపాసులు కాల్చవద్దు.
- పొడవాటి క్యాండిల్స్, అగరువత్తులను మాత్రమే వాడి టపాసులను కాల్చాలి.
- ఆ సమయంలో కళ్లకు అద్దాలు ధరించడం వల్ల రవ్వలు పడకుండా చూసుకోవచ్చు
- కాలిన గాయాలపై పోయటానికి లేదంటే మంటలు ఆర్పేందుకు నీటిని సమీపంలో పెట్టుకోవాలి
ఇవి చేయకూడదు ...
- టపాసులు కాల్చేటప్పుడు వాటిపై వంగిపోవడం సరికాదు. దూరం నుంచి వాటిని అంటించాలి.
- టిన్ డబ్బా, సీసా, కుండలు తదితర వాటిపై పెట్టి టపాసులు కాల్చకూడదు
- ఒకసారి అంటించిన తర్వాత వెలగలేదని చూసేందుకు వెంటనే దగ్గరకు వెళ్లవద్దు
- కళ్లలో టపాసుల అవశేషాలు గుచ్చుకుంటే తీసే ప్రయత్నం చేయవద్దు.. అలానే ఆసుపత్రికి తరలించాలి
Diwali Festival 2023 : ఈ సలహాలు, సూచనలు పాటిస్తూ వెలుగుల దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని వారు చెబుతున్నారు. తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అంటున్నారు.
రాష్ట్రమంతా దీపావళి సందడి- శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
దీపావళి వెలుగుల్లో వాస్తు - ఏ దిశలో ఏ రంగు దీపాలు వెలిగించాలో మీకు తెలుసా?