సుమారు 340 కిలోమీటర్ల మేర నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు పనులను అధికారులు రెండు భాగాలుగా చేపట్టనున్నారు. ఉత్తర భాగానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ జాతీయ రహదారుల నంబరును కేటాయించి, భూసేకరణకు అనుమతిచ్చింది. కేంద్రానికి పంపిన రెండు భాగాల అమరికను గూగుల్ మ్యాప్ ఆధారంగా రూపొందించారు. ఆ మార్గం సవివర నివేదిక(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు-డీపీఆర్)ను రూపొందించేందుకు కన్సల్టెంటు నియామకానికి కసరత్తు జరుగుతోంది. కొద్దికాలంగా ప్రాంతీయ రింగు రోడ్డు వెంట పెద్దఎత్తున స్థిరాస్తి వ్యాపారం సాగుతోంది. ప్రతిపాదిత అమరిక మారితే రియల్ ఎస్టేట్ వ్యాపారుల నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లే.
మార్పులు తప్పవు
ప్రాంతీయ రింగు రోడ్డు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి వెళ్లనుంది. ఈ మార్గం నిర్మాణానికి సుమారు 9 వేల ఎకరాల వరకు భూసేకరణ చేపట్టాలి. ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ రింగు రోడ్డు వెంట అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో నిర్మించిన రింగు రోడ్డు, తాజాగా ప్రతిపాదించిన ప్రాంతీయ రింగు రోడ్డు పక్కపక్కనే వస్తున్నట్లు గుర్తించారు.
యాదాద్రి-భువనగిరి జిల్లాలో బస్వాపూర్ రిజర్వాయర్ కూడా ప్రాంతీయ రింగు రోడ్డుకు సమీపంలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇదే మాదిరిగా కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక అమరికలో ఎక్కడైనా అడవులు, కొండలు, చెరువులు, కుంటలు, నివాస ప్రాంతాలు వస్తే వాటిని తప్పించడం మినహా మిగిలిన ప్రాంతాల్లో ఎలాంటి మార్పులు ఉండవని అధికారులు సైతం భావించారు. ప్రాంతీయ రింగు రోడ్డుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఇటీవల సమీక్ష నిర్వహించిన సందర్భంలో గజ్వేల్ రింగు రోడ్డు వ్యవహారం చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రాంతీయ రింగు రోడ్డు వెళ్లే మార్గంలో గడిచిన నాలుగేళ్లలో చేపట్టిన పనులు పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.
ఇదీ చూడండి: ఆ ఆస్పత్రుల్లో మళ్లీ కొవిడ్ సేవలు: ఈటల