Telemedicine services : మండలస్థాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) అందుబాటులోకి వస్తున్న టెలీమెడిసిన్ సేవలు పల్లె ప్రజలకు ప్రయోజనకరంగా మారుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని బస్తీదవాఖానాలను ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రులకు అనుసంధానించారు. ఫలితంగా బస్తీల్లోని పేదలు మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారు. దీంతో ఈ విధానాన్ని ప్రభుత్వం క్రమేపీ గ్రామీణ ప్రాంత పీహెచ్‌సీలకూ విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ సేవలు అనుసంధానమైన ప్రాంతాల్లో స్పెషాలిటీ వైద్యం అవసరమైన వారు వ్యయ ప్రయాసలకోర్చి నగరంలోని పెద్దాసుపత్రులకు రాకుండానే సేవలు పొందుతున్నారు. టెలీ వైద్యం కోసం ఒక్క ఉస్మానియా ఆసుపత్రి నుంచే నిత్యం 100కు పైనే స్లాట్లు కేటాయిస్తున్నారు.
నిపుణులు అందుబాటులో లేక..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని విభాగాల వైద్య నిపుణులు అందుబాటులో ఉండరు. ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రుల్లోనూ అంతంతే. పల్లె ప్రజల్లో అధికశాతం అల్పాదాయ వర్గాలు కావడంతో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకునే పరిస్థితి ఉండటం లేదు. స్థానికంగా ఉన్న వైద్యునిపై ఆధారపడుతున్నారు. దీంతో వ్యాధులు ముదిరిపోయి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టెలీమెడిసిన్ సేవలు ఆశాదీపంలా మారాయి. వివిధ అనారోగ్య సమస్యలతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదిస్తున్న వారిని తొలుత అక్కడి వైద్యులు పరిశీలిస్తున్నారు. నిపుణుల సూచనలు అవసరమైతే ఉస్మానియా, గాంధీ లేదా నిమ్స్ వైద్యులను టెలీమెడిసిన్ ద్వారా సంప్రదిస్తున్నారు. ఇందుకోసం ముందు రోజే స్లాట్ బుక్ చేస్తున్నారు. అదే సమయానికి ఉస్మానియా లేదా గాంధీ వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. నేరుగా ట్యాబ్‌లో రోగిని చూస్తూ వారి సమస్యలు వింటున్నారు. అనంతరం పీహెచ్‌సీలో ఉన్న వైద్యునికి సూచనలు, సలహాలు, చికిత్సలు వివరిస్తున్నారు. అవసరమైతే పరీక్షలు సూచిస్తున్నారు. శస్త్రచికిత్స చేయాలంటే పెద్దాసుపత్రులకు రప్పించి చికిత్స చేసి పంపుతున్నారు. ఇలా ప్రాణాంతక రోగాలకు ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకట్ట వేస్తున్నారు.
ప్రజలు వినియోగించుకోవాలి
ఉస్మానియాలో టెలీమెడిసిన్ సేవలకు మంచి స్పందన వస్తోంది. నిత్యం 100-120 మంది రోగులు స్లాట్లు బుక్ చేసుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని రోగులకు ఇక్కడి నుంచే మా వైద్యులు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఫలితంగా వైద్య కేంద్రాలపై ఒత్తిడి తగ్గుతుంది.
డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆసుపత్రి
ఇదీ చదవండి: land Regularization : భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల విధివిధానాల్లో మార్పులు