గతంలో ఎన్నడూ లేని విధంగా టీఎస్‌ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం ఆ సంస్థకు మంచి పేరు తేవడమే కాదు.. ప్రయాణికుల సంఖ్యనూ పెంచింది. పండగొస్తే బాదుడే అనే నానుడిని పక్కన పెట్టి.. దసరాకు ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనం ఛార్జీలు లేవని ప్రకటించడంతో అందరూ ఆర్టీసీ బాట పడుతున్నారు. రిజర్వేషన్‌లు కూడా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రాకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు. సోమవారం 369 ప్రత్యేక బస్సులు నిండుగా వెళ్లగా.. సోమవారం రాత్రి 10 గంటల వరకే 320 బస్సులు పంపామన్నారు.
ఎంజీబీఎస్ నుంచి పెరిగిన ప్రయాణికులు:
ఎంజీబీఎస్ నుంచి రోజూ 2,950 రెగ్యులర్ బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఆంధ్రాలోని వివిధ పట్టణాలకు 140 బస్సుల వరకు వెళ్తాయి. రెగ్యులర్, ప్రత్యేక బస్సులకు టిక్కెట్ ధరలో తేడా లేకపోవడంతో ప్రస్తుతం నిండుగా వెళ్తున్నాయి. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఆంధ్రాకు 32 బస్సులు అదనంగా నడిపినట్టు రంగారెడ్డి రీజియన్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. విశాఖపట్నం, విజయవాడకు ఏసీ గరుడ, రాజధాని బస్సులు వెళ్తున్నాయి. వీటికి అదనంగా లగ్జరీ బస్సులూ నడుస్తున్నాయి.
ఎన్నాళ్లకు చల్లని కబురు
పండగలు ఎప్పుడొస్తాయా.. ఛార్జీలు పెంచేద్దామనే ప్రైవేట్ ట్రావెల్స్‌కు టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం చెంపపెట్టులా మారింది. సాధారణ టిక్కెట్ ధరకే ఆర్టీసీ తీసుకెళ్తుందనడంతో చాలామంది ఊరట చెందారు. ఆర్టీసీ బస్సు అంటేనే సామాన్యుడి ప్రయాణ వనరు. అదనపు భారం లేకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయం. కర్నూలుకు కుటుంబ సమేతంగా వెళ్తున్నా..
- ప్రశాంత్, వ్యాపారి
టీఎస్‌ఆర్టీసీకి అభినందనలు
దసరా వేళ టీఎస్‌ఆర్టీసీ గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు అభినందనలు. రోజూ నడిచే బస్సులను కూడా ప్రత్యేక బస్సులుగా పేర్కొంటూ 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసే పద్ధతికి మంగళం పాడడం సంతోషంగా ఉంది. మేము మెట్రోలో ఎంజీబీఎస్‌కు వచ్చి విజయవాడ బస్సెక్కాం. చాలా ఆనందంగా ఉంది.
-: మహేష్, విజయవాడ
ఇదీ చదవండి: Saddula Bathukamma 2021: గడగడపనా పూల సంబురం.. బతుకు పండుగకు నీరాజనం!