Rs. 1 Lakh for Minorities in Telanagana : తెలంగాణలో బీసీల్లోని చేతివృత్తులవారికి ఇస్తున్నట్టుగానే... పేద మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థికసాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకులతో సంబంధం లేకుండా మైనార్టీలకు ఈ ఆర్థికసాయం అందించనున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారన్న మంత్రి హరీశ్... రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని వివరించారు. వారం, పది రోజుల్లో పేద మైనారిటీలకు... ఆర్థిక సాయం పంపిణీ ప్రారంభమవుతుందని హరీశ్‌రావు వెల్లడించారు.
Harishrao Latest Comments : హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఇవాళ మైనార్టీల సమావేశం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, హోం మంత్రి మహమూద్ అలీ ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లుగా నియమితులైన మైనార్టీ నేతలను మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ సన్మానించారు. అనంతరం మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు... ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలను ఎంతో గౌరవిస్తారని తెలిపారు. అదేవిధంగా గంగా జమునా తెహజీబ్ స్ఫూర్తిని అమలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి.. చేసేది ఒకటని ఎద్దేవా చేసిన ఆయన... దేశంలో ఇప్పటికీ ముస్లింలు పేదలుగానే ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ వల్లేనని హరీశ్ ఆరోపించారు.
మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ బీఆర్ఎస్ : మైనార్టీల కోసం ఒక్క సంవత్సరం బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన మొతాన్ని కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో కూడా కేటాయించలేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. దేశంలో మైనార్టీ అమ్మాయిలు ఎక్కువగా చదువుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. నీట్, పోటీ పరీక్షలను ఉర్దూలో నిర్వహించాలని అడిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని గుర్తు చేశారు. దేశంలో అన్ని మతాల ప్రజలను సమానంగా చూస్తున్న ఒకే ఒక్క సీఎం.. కేసీఆర్ అని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ దేశంలో ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మైనార్టీ నేతలు పాల్గొన్నారు.
'పేద మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థికసాయం. బ్యాంకులతో సంబంధం లేకుండా మైనార్టీలకు ఆర్థికసాయం అందిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అదేశాలు జారీ చేశారు. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. వారం, పది రోజుల్లో ఆర్థిక సాయం పంపిణీ మొదలవుతుంది. దేశంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ ఒక్క బీఆర్ఎస్ మాత్రమే.'-హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి
ఇవీ చదవండి :