ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో చాలా గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. ఆస్పత్రికి పోవాలంటే.. ఎన్నో అవస్థలు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని సాలూరు మండలం సిరివర గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. గ్రామానికి చెందిన మెల్లక అలుసు అనే వ్యక్తికి వారం రోజులుగా కడుపు నొప్పి. స్థానికంగా వైద్యం అందించినా.. తగ్గకపోవటం వల్ల అతన్ని డోలీలో తీసుకువెళ్లారు. ఏకంగా 15 కిలోమీటర్లు డోలీలో మోసి.. ఆసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం.. పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లమని రోగికి సూచించారు. 108 వాహనం అందుబాటులో లేక కుటుంబీకులు బాధితుల్ని బస్సులో పార్వతీపురం తీసుకొచ్చారు. బస్సు దిగాక బాధితుడిని.. అతని అల్లుడు మోసుకుంటూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
2 వారాల క్రితం పార్వతి అనే మహిళ ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల డోలీలోనే ఆసుపత్రికి తరలించామని గ్రామస్థులు తెలిపారు. గర్భిణీలను కూడా డోలీలోనే తరలించాల్సి వస్తోందని అడవి బిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి తమ కష్టాలు గట్టెక్కించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఇవీ చూడండి:ఆరుబయట మలవిసర్జన చేశారని చిన్నారుల్ని కొట్టి చంపారు!