హోం మంత్రి మహమూద్ అలీని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కలిశారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న డీఎస్పీ, ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు.
డీఎస్పీ పోస్టులను గత 10 ఏళ్లుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద భర్తీ చేయడం లేదని.. మొత్తం పోస్టులన్నీ ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారని కృష్ణయ్య పేర్కొన్నారు. 40 శాతం డైరెక్టు రిక్రూట్మెంట్ కోటా కింద ఈ 10 ఏళ్ల కాలంలో 210 పోస్టులు భర్తీ చేయవలిసి ఉందని.. కానీ టెంపరరీ ప్రమోషన్ల పేరు మీద మొత్తం పోస్టులన్నీ సీఐలకు డీఎస్పీలుగా పోస్టింగ్స్ ఇస్తున్నారని తెలిపారు. ఈ విధానం వల్ల నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు హోం మంత్రి జోక్యం చేసుకుని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద వచ్చే డీఎస్పీ పోస్టులను లెక్కించి.. భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీస్ శాఖలో ఇటీవల 131 పోలీస్స్టేషన్లు, 30 సర్కిల్ కార్యాలయాలు, 25 డీఎస్పీ కార్యాలయాలు కొత్తగా ప్రారంభించారని.. ప్రమోషన్ల ద్వారా కొత్త పోస్టులు సృష్టించడం ద్వారా దాదాపు 800 ఎస్సై పోస్టులు, 12 వేల కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కృష్ణయ్య పేర్కొన్నారు. వీటన్నింటిని భర్తీ చేసేలా తగు ఆదేశాలు జారీ చేయాలని హోం మంత్రిని కోరారు.