Revanthreddy on Telangana Assembly Elections 2023 : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఆరు నెలలు కష్టపడి పనిచేయాలని... పనితనం ఆధారంగానే టికెట్లు వస్తాయని నేతలకు సూచించారు. అలాగే సర్వేల ప్రాతిపదికనే టికెట్లు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్ ప్రాంగణంలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించారు.
పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది : పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసిన వారిని తప్పుకుండా గుర్తిస్తుందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకు కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజే ఉదాహరణ అని చెప్పారు. ఈ సమావేశంలో నాలుగు తీర్మానాలు చేసినట్లు రేవంత్ తెలిపారు. ఏఐసీసీ సెక్రెటరీలు బోసురాజు, నదీమ్ జావీద్‌లను అభినందిస్తూ, కొత్తగా నియమితులైన సెక్రెటరీలకు స్వాగతం పలుకుతూ 2 వేర్వేరు తీర్మానాలు చేసినట్లు పేర్కొన్నారు. బోయిన్‌పల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంఖుస్థాపనకు సోనియాగాంధీని ఆహ్వానించాలని సభ మరో తీర్మానం చేసిందని చెప్పారు.
'పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుంది. కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజు ఉదాహరణ. బోయినపల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంకుస్థాపనకు సోనియాను ఆహ్వానించాలని తీర్మానం. ఈ 6 నెలల పనితనం ఆధారంగానే టికెట్లు వస్తాయి. సర్వేల ప్రాతిపదికనే టికెట్లు ఇస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరం కలసికట్టుగా పనిచేద్దాం. '-రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న భట్టి పాదయాత్ర : మరోవైపు సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క పాదయాత్ర 1000 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఆయన్ను అభినందిస్తూ తీర్మానం చేసినట్లు రేవంత్‌రెడ్డి వివరించారు. పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలు ఇన్‌ఛార్జిలుగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒక నివేదిక పంపాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్‌లతో పాటు సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. అలాగే భట్టి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా పార్టీ కార్యకర్తలు గాంధీభవన్‌లో సంబరాలు నిర్వహించారు. టపాకాయలు పేల్చుతూ స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.
ఇవీ చదవండి :