Revanth reaction on CBI notice to Kavitha : టీఆర్ఎస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ బెంగాల్ తరహా ప్రయోగం జరుగుతోందని పేర్కొన్నారు. దిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ అందరినీ దిల్లీకి పిలిచిందన్న రేవంత్.. ఎమ్మెల్సీ కవిత విచారణకు మాత్రం ఆప్షన్లు, అనుమతి కోరుతోందని ఆరోపించారు.
దిల్లీ లిక్కర్ కేసులో మిగతా వారిని దిల్లీలో విచారించి కవితను మాత్రం అనుమతి కోరుతున్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి విచారణ చేపడతామని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఇక్కడే అసలు విషయం ఏంటో తెలుస్తోంది. కవితకు సీబీఐ నోటీసుల విషయంలో మాకు అనుమానాలు ఉన్నాయి. కేసీఆర్ అవినీతి చిట్టా బయట పెట్టాలంటే చాలా ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.
కోకాపేట భూములు, ఇతర కేసులపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. గతంలో ఈసీకి ఫిర్యాదు చేస్తే ఇప్పటికీ స్పందన లేదని మండిపడ్డారు. దిల్లీలో అయిదు రోజులు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదని వాపోయారు. ఈనెల 6 లోపు స్పందించకపోతే దిల్లీ హైకోర్టు తీర్పు చెల్లకుండా పోతుందని చెప్పారు.