Revanth Reddy Latest Comments : దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటుంటే ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో మోదీ సర్కార్ ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ హెచ్చరించినా.. దేశ భద్రత కేంద్రానికి పట్టడం లేదని విమర్శించారు. కుటుంబసభ్యులకు దోచిపెట్టడానికే కేసీఆర్ దేశం మీద పడ్డారని ఆయన ఆక్షేపించారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైన ఆయన.. పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
ఈ సందర్భంగా స్వాతంత్య్ర పూర్వపు పరిస్థితులే ఇప్పుడు దేశంలో నెలకొన్నాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. బ్రిటీష్ విధానాలను దేశ ప్రజలపై రుద్దాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశానికి పొంచి ఉన్న ముప్పు నుంచి కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. మహాత్ముడి స్ఫూర్తితో ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారని కొనియాడారు. రాహుల్ పాదయాత్ర భయంతోనే మోదీ కొవిడ్ రూల్స్ తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ శ్రేణులు అందరూ పాల్గొనాలి..: రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. దేశం, రాష్ట్రం ప్రమాదంలో ఉన్నాయని.. ఇలాంటి సమయంలో వ్యక్తిగత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కాంగ్రెస్ శ్రేణులు ప్రజల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే హాత్ సే హాత్ జోడో యాత్రలో కాంగ్రెస్ శ్రేణులు అంతా పాల్గొని ప్రజల పక్షాన నిలవాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేశ్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, సంభాని చంద్రశేఖర్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మల్లు రవి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
"దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించింది. ఆనాటి నుంచి దేశ సమగ్రతను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చింది. మహాత్ముడు మరణించినా ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోంది. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చారు. దేశ సమగ్రతను కాపాడటంలో విదేశీ శక్తులకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ కొట్లాడారు. నేతలను బలిగొన్నా.. దేశ ప్రజల కోసం, దేశ అభ్యున్నతికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారు. ప్రపంచ దేశాల ముందు శక్తివంతమైన దేశంగా భారత్‌ను నిలబెట్టారు. సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌ది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా ఆనాడు బీజేపీ అడ్డుకుంది. తెలంగాణలో చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం ఉందంటే.. అది కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయమే."- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: