Revanth Responded On ED Notices Congress Leaders: కాంగ్రెస్ నేతలను కేంద్రం ఈడీ సాకుతో మరోసారి బెదిరించాలని చూస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాహుల్‌గాంధీ పాదయాత్రలో సీనియర్ నేతలు పాల్గొనకుండా ఉండేందుకే ఈడీ నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే గీతారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్‌కు ఈడీ నోటీసులు ఇచ్చారని రేవంత్‌రెడ్డి తెలిపారు.
కుటుంబంలో వాటాల పంచాయతీ తెంచేందుకే బీఆర్‌ఎస్: కేసీఆర్ కుటుంబంలో వాటాల పంచాయతీ తెంచేందుకే బీఆర్‌ఎస్ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పల్లవిని ఎత్తుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. యూపీఏ కూటమిని చీల్చి భాజపాకి పరోక్షంగా మద్దతు ఇవ్వడానికే కేసీఆర్ ప్రతిచర్య ఉందని విమర్శించారు. కేసీఆర్ మోదీని ఓడించాలనుకుంటే భాజపా భాగస్వామ్య పక్షాలను బయటకు తీసుకురావాల్సి ఉందని.. ఆ దిశగా ఏలాంటి చర్యలు లేవని ధ్వజమెత్తారు.
జాతీయ స్థాయిలో పార్టీల మద్దతు కూడగడుతున్న కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ను ఎందుకు కలుపుకోవడం లేదని ప్రశ్నించారు. ఇందువల్లనే తెరాసపై ఎన్ని ఫిర్యాదులు ఉన్నా ఇప్పటి వరకు ఈడీ అధికారులు ఛార్జీషీట్ కూడా వేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ను బలహీన పరచేందుకే కేసీఆర్, మోదీ ప్రయత్నిస్తున్నట్లు రేవంత్ రెడ్డి విమర్శించారు.
అధ్యక్ష పదవికి ఎవరు పోటీ చేసినా వారందరిని సమానంగానే గౌరవిస్తాం: ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎవరు పోటీ చేసినా వారందరిని సమానంగానే గౌరవిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ వచ్చిన శశిథరూర్ తనకు ఫోన్ చేసి బ్రేక్‌ఫాస్ట్‌కు రావాలని ఆహ్వానించారని తెలిపారు. కానీ తన దగ్గర బంధువు మృతి చెందడంతో కలువలేకపోతున్నట్లు తెలిపానని అన్నారు. అధ్యక్ష పదవికి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగుతాయని పీసీసీ ప్రతినిధులు నచ్చిన వారికి ఓట్లు వేయవచ్చని సూచించారు.
మల్లిఖార్జున ఖర్గే తెలంగాణ వాసి అయినందున తమ పార్టీకి చెందిన కొందరు మద్దతుగా నిలుస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. శశిథరూర్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 2018 నుంచి నాలుగు ఉప ఎన్నికలు జరిగితే రెండు స్థానాలు తెరాస, రెండు నియోజక వర్గాలు భాజపా గెలిచినా అక్కడ పైసా మార్పు కూడా రాలేదని ఆరోపించారు.
మునుగోడులో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన స్వర్గీయ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురునే బరిలో నిలిపినట్లు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల విషయంలో ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో గుణాత్మక మార్పు తీసుకొస్తామన్న రేవంత్ రెడ్డి.. 11 రాష్టాల్లో ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా భాజపా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందని ఆరోపించారు.
ఇవీ చదవండి: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు
హైదరాబాద్ నగర నడిబొడ్డు నుంచే భారత్ జోడో యాత్ర.. రూట్ మ్యాప్ ఇదే..