Congress on TS Budget Allocations: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేసింది. బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధంగా బడ్జెట్ ప్రక్రియ నిర్వహించలేదన్న నేతలు.. ఏటా ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రగతి నివేదికను ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. విద్యార్థులు, ఉద్యమకారులను అవమానించేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్‌లో ఉద్యోగాలు లేవని.. నిరుద్యోగ భృతి లేదని మండిపడ్డారు. తొలి, మలిదశ ఉద్యమాల్లో 1500 అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్న ప్రభుత్వం.. వారికి మొండిచేయి చూపించిందని ఆరోపించారు. చివరి బడ్జెట్లోనూ వారిని కేసీఆర్ అవమానించారని ఆక్షేపించారు.
ఇదే చివరి బడ్జెట్
Revanth reddy on TS Budget: సొంత జాగా ఉన్న వాళ్లకు ఇళ్ల నిధులపై కేసీఆర్ మళ్లీ మోసం చేశారని రేవంత్ ఆరోపించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ.3లక్షలకు కుందించిందని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లు తప్ప.. గ్రామాల్లో తెరాస ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. బడ్జెట్‌లో డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల ఊసు లేదని గుర్తు చేశారు. మొదటి సమావేశంలో పెట్టిన తీర్మానం ప్రకారం ఉద్యోగం, రెండు పడకల ఇల్లు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెరాస ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ అని జోస్యం చెప్పారు.
"ఇది సీఎం కేసీఆర్‌కు చివరి బడ్జెట్.. ఇందులో కూడా నిరుద్యోగులను, అమరవీరుల కుటుంబాలను అవమానించారు. ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు. సొంత జాగా ఉన్న వారికి రూ.5 లక్షలని చెప్పి.. రూ. 3 లక్షలకే కుదించారు. స్పీకర్ వైఖరికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపడతాం. సభలో ఏమైనా చర్యలు తీసుకోవాలి అనుకుంటే.. బీఏసీలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి." -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ప్రచారానికే బడ్జెట్
Bhatti Vikramarka on TS Budget: తెరాస ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రచారానికి తప్ప... ప్రజలకు పనికొచ్చేది కాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. వాస్తవాలకు దూరంగా బడ్జెట్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపులకు.. వ్యయాలకు అసలు పొంతన ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా నేరుగా బడ్జెట్ ప్రవేశ పెట్టడం.. రాజ్యాంగబద్ధంగా వస్తున్న సంప్రదాయాన్ని తుంగలో తొక్కడమేనని ఆరోపించారు. స్పీకర్ విధానం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని ధ్వజమెత్తారు. బడ్జెట్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రవేశ పెట్టారని మండిపడ్డారు.
"వాస్తవానికి దూరంగా తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త పథకాలు తెచ్చామని చెబుతున్నారు. గతేడాది బడ్జెట్ కూడా పెట్టిన దానికి వ్యయానికి పొంతన లేదు. ఈ కేటాయింపులన్నీ కేవలం చెప్పుకోవడం కోసమే. రాజ్యాంగ విరుద్ధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు." -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
రేపు నిరసనలు
Protests against Speaker Pocharam: అసెంబ్లీలో స్పీకర్ వైఖరికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని.. పార్టీ నాయకులను, శ్రేణులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు అంబేడ్కర్ విగ్రహాల వద్ద నల్ల రిబ్బన్లను కట్టుకుని నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. 30 రోజులు జరపాల్సిన బడ్జెట్ సమావేశాలను ఏడు రోజులకు కుదించారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలు మొత్తానికి భాజపా ఎమ్మెల్యేలను బహిష్కరించడాన్ని చేయడాన్ని కాంగ్రెస్ ఖండిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజున సభ్యులపై ఎలాంటి చర్యలు ఉండవని.. కాని అందుకు భిన్నంగా స్పీకర్ వ్యవహరించారని విమర్శించారు. ఏమైనా చర్యలు తీసుకోవాలంటే బీఏసీలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.
ఇదీ చదవండి: బడ్జెట్ ప్రసంగం తెరాస వీడ్కోలు ప్రసంగంలా ఉంది: కిషన్ రెడ్డి