Right to Information Act: సమాచార హక్కు చట్టం కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్ని పరిష్కరించడానికి పట్టే సమయాన్ని సతర్క్ నాగరిక్ సంఘటన్ (ఎస్.ఎన్.ఎస్) అనే సంస్థ అంచనా వేసింది. సమాచార హక్కు చట్టం కింద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ పరిష్కరించడానికి తెలంగాణలో నాలుగేళ్ల అయిదు నెలల సమయం.. అంటే 53 నెలలు పడుతుంది. ఒడిశాలో ఆరేళ్ల ఎనిమిది నెలలు (80 నెలలు) అవసరం. కేసుల పరిష్కారం నత్తనడకన సాగు తుండటం..దరఖాస్తులు, అప్పీళ్లు గుట్టల్లా పేరుకుపోతుండటమే ఇందుకు కారణం. సమాచారం అందించాలని కేంద్ర కమిషన్(సీఐసీ) ఆదేశాలు ఇచ్చినా అమలు చేయనందుకు తెలంగాణలో కేవలం 2 శాతం కేసుల్లోనే సంబంధిత అధికారులకు పెనాల్టీ విధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇది మరీ అధ్వానంగా సున్నాయే. మేఘాలయలో అత్యధికంగా 29 శాతం కేసుల్లో పెనాల్టీ వేసినట్లు ఎస్.ఎన్.ఎస్ తాజాగా దేశవ్యాప్తంగా సహ చట్టం అమలుపై విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా 95 శాతం కేసుల్లో పెనాల్టీ విధించలేదని.. కేవలం 4.9 శాతం కేసుల్లోనే వేశారని విశ్లేషించింది. సమాచారం ఇవ్వాలంటూ కమిషన్ ఆదేశాలు జారీ చేసినా అనేక రాష్ట్రాలు అమలు చేయడం లేదు. దరఖాస్తులను పరిష్కరించినట్లు చెబుతున్న సందర్భాల్లోనూ తిరస్కరించాయా లేక సమాచారం ఇచ్చాయా స్పష్టం చేయడం లేదు. ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని సంస్థ పేర్కొంది.
రెండుసార్లు కమిషన్‌ను ఆశ్రయించినా..
హైదరాబాద్‌లోని ఆస్‌బెస్టాస్ కాలనీలో ఆక్రమణల గురించి 2016లో సమాచార హక్కు చట్టం కింద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ దరఖాస్తు చేసింది. ఇవ్వకపోతే అప్పీలుకు వెళ్లింది. అయినా లాభం లేకపోవడంతో కమిషన్ వద్ద అప్పీలు చేసింది. సమాచారం ఇవ్వాలని సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశించింది. అయినా ఇవ్వలేదు. దీంతో మళ్లీ కమిషన్‌ను ఆశ్రయించింది. దీంతో గత అక్టోబరులో కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. సమాచారం కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టంచేసింది. సమాచారం ఇంకా అందాల్సి ఉంది. ఈ చట్టం కింద అయిదేళ్లుగా పోరాడుతున్న సంస్థకే ఈ పరిస్థితి ఎదురుకావడం గమనార్హం. ఇదో ఉదాహరణ మాత్రమే. కింది స్థాయిలోనే దరఖాస్తులను తిరస్కరించడం, అప్పీలుకు వెళ్లినా పట్టించుకోకపోవడం సర్వసాధారణంగా మారింది. సమాచారం ఇవ్వకపోయినా ఏమీ కాదులే అనే ధీమా సంబంధిత అధికారుల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం పార్లమెంటులో ఎంపీలకు ఇచ్చే ఏ సమాచారమైనా దరఖాస్తుదారుడికి ఇవ్వాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
నాలుగు రాష్ట్రాల్లో పూర్తిగా పనిచేయని కమిషన్లు
పలు రాష్ట్రాల్లో సమాచార కమిషన్లు సక్రమంగా పనిచేయడం లేదు. కమిషనర్లను నియమించకపోవడం, సుదీర్ఘకాలం రాష్ట్ర ప్రధాన కమిషనర్లు లేకపోవడం సర్వసాధారణంగా మారిందని ఎస్.ఎన్.ఎస్. పేర్కొంది. ఈ నివేదిక వెలువడే సమయానికి నాలుగు కమిషన్లు పూర్తిగా పనిచేయడం లేదని వెల్లడించింది. ఝార్ఘండ్, త్రిపుర, మేఘాలయ, గోవాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది.
కార్యాలయానికి వచ్చి చూసుకొని వెళ్లాలట!
తెలంగాణలో ప్రజాప్రతినిధులపై ఉపసంహరించుకున్న కేసుల గురించి సమాచారం కోరుతూ 2017లో దరఖాస్తు చేయగా ఇవ్వకపోవడంతో.. దరఖాస్తుదారు అప్పీలుకు, కమిషన్‌కు వెళ్లారు. ఆ సమాచారం ఇవ్వాలంటూ 2019 నవంబరులో కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అయినా ఇవ్వలేదు. చాలా పేజీలు ఉంటాయని, కార్యాలయానికే వచ్చి చూసుకొని వెళ్లండని సమాచారమిచ్చారు. అధికారికంగా ఇవ్వకుండా, కేవలం చూసుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని దరఖాస్తుదారు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకుండా తిరస్కరించడం, నెలల తరబడి ఏదో ఒక సాకుతో కాలయాపన చేయడం సర్వసాధారణమైందని ఆంధ్రప్రదేశ్‌లో సమాచార హక్కు చట్టంపై పనిచేస్తున్న ఓ కార్యకర్త తెలిపారు.
ఇదీ చదవండి: Etela Jamuna Comments: గతంలో లేనిది ఇప్పుడే ఆక్రమించుకున్నారా?