మెట్రో రైల్ సహా హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ సంస్థలు నిర్మించిన బస్ షెల్టర్లు, టాయిలెట్లు తదితరాలు ప్రస్తుతానికి ప్రభుత్వానికి చెందవని... వాటిపై ఎవరైనా ప్రకటనలు పెట్టుకోవచ్చని సంబంధిత సంస్థలు తెలిపాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మెట్రో రైల్, బస్ షెల్టర్లు, టాయిలెట్లపై అధికార తెరాస ప్రకటనలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని భాజపా, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
ఫిర్యాదుల నేపథ్యంలో మెట్రో రైల్, జీహెచ్ఎంసీ నుంచి ఎస్ఈసీ నివేదిక కోరింది. మెట్రో రైల్, బస్ షెల్టర్లు, టాయిలెట్లను ప్రైవేట్ సంస్థలు వారి వారి నిధులతో నిర్మించాయని... వాటిపై ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని ఒప్పందంలోనే ఉందని నివేదికలో వివరించారు. ఆ ఒప్పందం ప్రకారం రాజకీయ పార్టీలు, సంస్థల ప్రకటనలకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ఆయా సంస్థల వివరణలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం... దరఖాస్తు చేసుకున్న అన్ని పార్టీల ప్రకటనలకు అవకాశం ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు గతంలో కూడా ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేసింది.
- ఇదీ చూడండి: భాగ్యనగరంలో ప్రగతి రథం... పెట్టుబడుల పథం