వాన్‌పిక్ వ్యవహారంలో సెర్బియా పోలీసులు నిర్బంధంలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ విడుదలయ్యారు. వాన్‌పిక్ వ్యవహారంలో లాభాలు ఆర్జించడానికి, నిధులు తరలించడానికి ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించారనే ఆరోపణలపై యూఏఈ ఫెడరల్ క్రిమినల్ కోడ్‌లోని పలు ఆర్టికల్ కింద నిమ్మగడ్డ ప్రసాద్‌పై కేసు నమోదైంది. ఆ కేసులో నిందితుడిని తమకు అప్పగించాలన్న రస్ ఆల్ ఖైమా(రాక్) దేశ అభ్యర్థన మేరకు అబుదాబిలోని ఇంటర్ పోల్ 2016 సెప్టెంబరు 5న రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. అది జారీ అయ్యాక బ్రిటన్, సింగపూర్‌తో సహా పలు దేశాల్లో నిమ్మగడ్డ పర్యటించినా పట్టించుకోలేదు. సెర్బియా వెళ్లినపుడు అకస్మాత్తుగా అక్కడి పోలీసులు జులై 27న ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం బెల్‌గ్రేడ్‌లోని ఉన్నత న్యాయస్థానంలో నిమ్మగడ్డ ప్రసాద్‌ను హాజరుపరిచారు. సదరు నిర్బంధాన్ని కోర్టు అనుమతించింది. ‘‘ఈ నిర్బంధం జులై 27న ఉదయం 8.20 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. ప్రతి రెండు నెలలకోసారి పరిస్థితులను సమీక్షించి నిర్బంధ ఉత్తర్వులను పొడిగించే అవకాశం ఉంటుంది. గరిష్ఠంగా ఏడాది వరకు నిర్బంధాన్ని కొనసాగించడానికి వీలుంటుందని కోర్టు పేర్కొంది.
నిందితుడి వాదనలు వినకుండా తక్షణం అదుపులోకి తీసుకోవడానికి అక్కడి చట్టాలు అనుమతిస్తున్నాయని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా షరతులతో నిమ్మగడ్డను కోర్టు విడుదల చేసినట్టు సమాచారం. విడుదలైనప్పటికీ అక్కడున్న చట్ట ప్రక్రియ పూర్తయ్యేదాకా ఆయన బెల్‌గ్రేడ్ నగరం నుంచి బయటికి వెళ్లే అవకాశం లేదు.
ఇదీ చూడండి: 'జైలు నుంచి నిమ్మగడ్డ విడుదల.. దేశం విడిచి వెళ్లరాదు'