తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న అవార్డులతోపాటు, రావాల్సిన పెండింగ్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూపొందించిన అనేక పథకాలతోపాటు, 32 జిల్లాల్లో, 540 మండలాల్లోని 12,770 గ్రామాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
కరోనా సమయంలోనూ నగరాలు, పట్టణాల నుంచి గ్రామాలకు తిరిగి వెళ్లిన లక్షలాది మంది వ్యవసాయ కూలీలకు కూడా ఉపాధి కల్పించినట్లు మంత్రి తెలిపారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏడాది రావాల్సిన వాటా రూ.1719.25 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.694.66 కోట్లు మాత్రమే విడుదల చేశారని మంత్రి పేర్కొన్నారు. ఇంకా రావాల్సిన రూ.1024.59 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆయా గ్రామాల్లో ఇప్పటికే పనులు పూర్తిచేసి బిల్లులు రాక కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేసిన పనులతో ఉపాధి హామీ పథకం ఆశయాన్ని నెరవేరుస్తూ, లక్ష్యాలను సాధిస్తూ, దేశంలో నంబర్ వన్‌గా నిలుస్తూ, అవార్డులు పొందుతూ, ఉపాధి హామీలో అగ్రగామిగా ఉన్న తెలంగాణకి ఉపాధి హామీ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రికి మంత్రి ఎర్రబెల్లి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.