రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ మూడో తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ ఖరారు చేసింది. ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సైన్స్ పరీక్ష మాత్రం ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.50 నిమిషాల వరకు జరుగుతుంది. ఏప్రిల్ మూడో తేదీన మొదటి భాష, నాలుగో తేదీన రెండో భాష, ఆరో తేదీన ఆంగ్లం పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ ఎనిమిదో తేదీన గణితం, పదిన సైన్స్, పదకొండో తేదీన సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 12వ తేదీన ఓఎస్ఎస్సీ మొదటి పేపర్, 13న ఓఎస్ఎస్సీ రెండో పేపర్ పరీక్షలు జరుగుతాయి.
ఏ పరీక్షకు ఎన్ని మార్కులు: పదో తరగతి పరీక్షల పేపర్లను రాష్ట్ర ప్రభుత్వం 11 నుంచి 6కు తగ్గించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి పరీక్షల్లో మార్పులు, చేర్పులు అమలు కానున్నాయి. తొమ్మిది, పదోతరగతికి చెందిన పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి వంద మార్కులు ఉంటాయి. ఇందులో ఫార్మేటివ్ అసెస్ మెంట్స్‌కు 20 చొప్పున మార్కులు.. తుది పరీక్షకు 80 చొప్పున మార్కులు ఉంటాయి. మొత్తం ఆరు సబ్జెక్టులకుగాను 600 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఏ సబ్జెక్ట్‌కు ఎంత సమయం: సైన్స్ సబ్జెక్ట్ విషయానికి వస్తే ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్‌కు చెరుసగం మార్కులు ఉంటాయి. సైన్స్ పరీక్షకు సమయం 3.20 నిమిషాలు ఇస్తారు. ఫిజికల్ సైన్సెస్, బయోలజికల్ సైన్సెస్‌కు 1.30 నిమిషాల పాటు సమయం ఇస్తారు. మధ్యలో ఫిజికల్ సైన్సెన్స్ సమాధాన పత్రాలు తీసుకునేందుకు, బయోలజికల్ సైన్సెస్ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చేందుకు 20 నిమిషాల సమయం ఉంటుంది. మిగిలిన ఐదు సబ్జెక్టులకు మూడు గంటల పాటు పరీక్షా సమయం ఉంటుంది. కాంపోజిట్ కోర్సులు ఉంటే కూడా 20 నిమిషాల అదనపు సమయం ఇస్తారు. ఒకేషనల్ విభాగం పరీక్షల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, ప్రస్తుత విధానం యథాతథంగా కొనసాగుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: