Reduction Of Property Tax In Municipalities : తెలంగాణలోని పురపాలికల్లో ఆస్తి పన్ను మదింపులో తకరారుకు ముకుతాడు పడనుంది. ఉపగ్రహ సేవల వల్ల ఆస్తిపన్ను మదింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా రాష్ట్రంలోని 141 పురపాలక సంఘాల్లో ఇళ్ల వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేసే విధానానికి 4 ఏళ్ల కిందట ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు తెలంగాణ పురపాలక సంఘాల డైరెక్టరేట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ)ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇది భువన్ ప్రాపర్టీ మ్యాపింగ్ పేరిట ఆ ప్రక్రియను చేపట్టింది. రాష్ట్రంలోని 20.80 లక్షల ఇళ్లకు సంబంధించిన వివరాలను నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా జియోట్యాగ్ చేసే ప్రక్రియను చేపట్టారు. అయితే ఇప్పటివరకు 17.92 లక్షల ఇళ్ల వివరాలను నమోదు చేశారు. ఆయా వివరాలను పురపాలికల్లో పన్ను వసూలు అధికారుల ఫోన్‌కి అనుసంధానం చేశారు. దీంతో ఆస్తిపన్ను మదింపు శాస్త్రీయంగా నిర్వహించారా..? లేదా..? అనేది అధికారులు నిర్ధరించేందుకు అవకాశం ఉంది.
GHMC Property Tax in Telangana : నిర్మాణ సమయంలో పేర్కొన్న విస్తీర్ణం ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తర్వాత ఉన్నత అధికారులు ఆస్తిపన్నును నిర్ధరిస్తారు. అనుమతికి మించిన విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టినా.. లేదా అనుమతి లేకుండా నిర్మించినా మ్యాపింగ్‌తో గుర్తించవచ్చని సంబంధిత వర్గాల సమాచారం. ఆస్తిపన్ను మదింపులో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ జియోమ్యాపింగ్ విధానం ద్వారా అక్రమాలకు ముకుతాడు పడుతుందని రాష్ట్ర పురపాలక శాఖ స్పష్టం చేస్తోంది. ప్రతి పురపాలక సంఘంలో నమోదు చేసిన వివరాల్లో 10 శాతం ఇళ్లకు సంబంధించి అధికారులు రూపొందించిన ఆస్తిపన్నుల వివరాలను ఎప్పటికప్పుడు జియోమ్యాపింగ్ ద్వారా సరిపోల్చి చూస్తారు. వాస్తవిక పరిస్థితులకు.. పన్ను మదింపు లెక్కలు అనుగుణంగా ఉన్నాయా..? లేదా..? అనేది నిర్ధరిస్తారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బందిలో జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
GHMC Property Tax : ఇప్పటివరకు రాష్ట్రంలోని 35 పురపాలక సంఘాల్లో 100% నిర్మాణాల వివరాలను జియోమ్యాపింగ్ ద్వారా అనుసంధానం చేయడం జరిగింది. అలాగే మిర్యాలగూడ మినహా మిగిలిన వాటిల్లో 80% వరకు అనుసంధానం పూర్తయినట్లు ఉన్నతాధికారి ఒకరు చెప్పినట్లు తెలిసింది. మిర్యాలగూడలో మాత్రం భువన్ యాప్‌తో కాకుండా మరో విధానంలో జియోమ్యాపింగ్ చేయాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. మిగతా 105 పురపాలక సంఘాల పరిధిలో రానున్న నెల రోజుల వ్యవధిలో ఆ ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల తెలిపినట్లు తెలుస్తోంది.
పది అంకెలకు కుదింపు..: ప్రతి నిర్మాణానికి రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేకంగా ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నంబరు (పీటీఐఎన్)ను కేటాయిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 10 అంకెలతో కూడిన నంబరు విధానం అమల్లో ఉండగా.. ఇతర పురపాలక సంఘాల్లో 15 అంకెలతో కూడిన నంబరు విధానం అమల్లో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేసే క్రమంలో అన్ని పురపాలక సంఘాల్లోనూ 10 అంకెలతో కూడిన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.
ఇవీ చదవండి: